కాంగ్రెస్, కూటమి పార్టీలతో దేశానికి విఘాతం
అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పాలి ఆర్టికల్ 370 రద్దు.. కాంగ్రెస్‌కు బాధ ఎందుకు? ఉగ్రవాదులకు లైసెన్సులు ఇవ్వాలా? టీఎంసీపై ధ్వజం దేశహితం, నిరుపేదల సంక్షేమమే లక్ష్యం బీహార్, పశ్చిమ బెంగాల్ఎన్నికల సభలో ప్రధాని మోదీ
పాట్నా, కోల్‌కతా: కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీల వల్ల భారత్‌కు తీవ్ర విఘాతం వాటిల్లుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవినీతి, కుటుంబత్వ పార్టీల వల్ల దేశానికి ఒరిగేదేం లేదన్నారు. మహిళలు, కేంద్ర సంస్థలపై దాడులే టీఎంసీ లక్ష్యంగా చేసుకుందని మండిపడ్డారు. లాలూ ప్రసాద్కుటుంబం అవినీతికి కేరాఫ్ పార్టీ అన్నారు. ఆదివారం బిహార్నవాడ, పశ్చిమ బెంగాల్ జల్పాయిగురి లో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ విపక్షాలపై విమర్శలు చేశారు.
ఓ వైపు తాము దేశాన్ని అభివృద్ధికి దిశగా తీసుకువెళుతుంటే, మరోవైపు అవినీతికి కేరాఫ్ అయిన లాలూ ప్రభుత్వం నిరుపేదలను దోచుకునేందుకు సిద్ధమవుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భూములకు బదులు రైల్వే ఉద్యోగాల కేసులో ఇప్పటికే వారిపై అనేక కేసులున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ప్రభుత్వం మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీలో మహిళలపై దాడులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలపై ప్రశ్నించేందుకు, అరెస్టులు చేసేందుకు వచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థలపై కూడా టీఎంసీ దాడులకు పాల్పడుతోందన్నారు.
వీరంతా దేశ హితాన్ని కోరుకునే వారు కాదన్నారు. 2014కు ముందు పరిస్థితులు దేశంలో ఎలా ఉండేవే ప్రజలు ఒక్కసారి మననం చేసుకోవాలని మోదీ తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగిస్తే కాంగ్రెస్‌కు బాధ ఎందుకని ప్రశ్నించారు. కశ్మీర్ అభివృద్ధిపై వారి హయాంలో మీనమేషాలు లెక్కించారని, ప్రజలను తప్పుదోవ పట్టించారని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ 140 కోట్ల మంది భారతీయులకు తలమానికమన్నారు. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలవి రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు. టీఎంసీ ఉగ్రవాదానికి ఉచిత లైసెన్సు ఇవ్వాలని కోరుకుంటోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఇలాంటి పార్టీలకు ప్రజలు పూర్తి బుద్ధి చెప్పేరీతిలో తీర్పునీయాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
నిరుపేదల సంక్షేమం, దేశ హితం కోసమే అహార్నిశలు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నిరుపేదల కోసం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి నేరుగా వారికే ఆయా పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తాము పదేళ్లలో సాధించిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని తెలిపారు. ఇంకా దేశాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు దేశ ప్రజల ఆశీర్వాదం తనకు లభించాలని మోదీ కోరారు.