జమిలిని దేశం విశ్వసిస్తోంది
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నికలు (జమిలి) ఎన్నికల ప్రాముఖ్యతను దేశం గుర్తిస్తుందని, విశ్వసిస్తోందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలోని ఓ కాలేజీలో యువతతో అంబాసిడర్ యూత్ కనెక్ట్ అనే కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. యువ విద్యార్థులు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వికసిత్ భారత్–2047లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
డెవలప్‌డ్ ఇండియా 2047లో చేరాలని యువ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులతో కలిసి ‘అమ్మ పేరుతో ఒక చెట్టు’లో పాల్గొని చెట్లు నాటారు. ఒకే ఎన్నికల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ 'ఒక దేశం ఒకే ఎన్నిక'పై నిష్పక్షపాతంగా నివేదిక ఇచ్చిందని, దానిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఒకే ఎన్నిక విధానాన్ని నమ్ముతుందని దేశవ్యాప్తంగా సమస్యల పరిష్కారానికి యువత చక్కటి వేదికను నిర్మించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలన్నారు. కొంతమంది రాజ్యాంగం పేరుతో బుక్ లెట్ లు విడుదల చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ కూటమి పార్టీలను విమర్శించారు. మోదీ అభివృద్ధి విజన్ కు యువత పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ విద్యాసంస్థకు రావడం తనకు ఎంతో ప్రాముఖ్యమైందన్నారు. విద్యార్థులు, కళాశాల ఉపాధ్యాయులను కలిసే అవకాశం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.