నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: ధరణి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్ లో బుధవారం కలెక్టర్ పర్యటించి పలు కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గురుకుల పాఠశాల, తహసిల్దార్ కార్యాలయం, మోడల్ స్కూల్, కళాశాల, బుదేరా డిగ్రీ కళాశాల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ధరణి సమస్యలు పెండింగ్ లో ఉండకూడదన్నారు. ఆరోగ్య సేవలపై వివరాలడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. మోడల్ స్కూల్ ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడాంశాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు తెలిపారు.
కలెక్టర్ వెంబడి తహసీల్దార్ ఆశ, వైద్యాధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.