నా తెలంగాణ, నిర్మల్: జిల్లాలోని వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హామీ ఇచ్చారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్టోబర్ 1వ తేది వరకు వారం రోజులు వయోవృద్ధుల అవగాహన, వినోదాల వారంగా నిర్వహించాలని సూచించారు. వృద్ధాశ్రమాలలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తల్లి దండ్రుల పోషణ, ఆరోగ్య సంరక్షణ పై అవగాహన ర్యాలీ, సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. తల్లి దండ్రుల పోషణ, సంరక్షణ చట్టం, 2007పై అవగాహన కల్పించాలన్నారు. అలాగే అంగన్ వాడి కేంద్రాలు, పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే ను నిర్వహించాలని, అక్టోబర్ 1న జిల్లా స్థాయి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
వయోవృద్ధులకు ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత, చట్టపరమైన రక్షణ, న్యాయ సలహాలను అందించాలని సూచించారు. సమాజంలో వృద్ధులను గౌరవించాలని వారి శ్రేయస్సు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలోని వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమానికి, శ్రేయస్సుకు కట్టుబడి ఉంటామని అధికారులు, వయోవృద్ధుల చేత ప్రతిజ్ఞ చేయించారు. వృద్దుల గౌరవం, శ్రేయస్సు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ నియమావళి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ వృద్ధులను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, డీఈఓ రవీందర్ రెడ్డి, గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ విజయలక్ష్మి, సీడీపీవో లు, సూపర్ వైజర్లు, వయో వృద్ధుల కమిటీ మెంబర్స్ ఎంసీ లింగన్న, ఇతర అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.