ఢిల్లీ అతలాకుతలం 70కి.మీ. వేగంతో ఈదురు గాలులు నేలకొరిగిన చెట్లు, విద్యుత్​ స్తంభాలు

23 మందికి గాయాలు కొనసాగుతున్న సహాయక చర్యలు

May 11, 2024 - 13:01
 0
ఢిల్లీ అతలాకుతలం 70కి.మీ. వేగంతో ఈదురు గాలులు నేలకొరిగిన చెట్లు, విద్యుత్​ స్తంభాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో శుక్రవారం రాత్రి 11 గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పూర్తిగా చల్లబడి భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల చెట్లు, స్తంభాలు నేలకొరగడంతో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో 23 మందికి గాయాలయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఢిల్లీకి రావాల్సిన విమానాలను జైపూర్​ కు దారి మళ్లించారు. రాత్రి కురిసిన వర్షానికి శనివారం కూడా సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం మునిగిపోయింది. కాగా వాతావరణ శాఖ హెచ్చరికలతో మరోమారు ఢిల్లీ ప్రజలను భయపెడుతోంది. మరో రెండు రోజులపాటు ఢిల్లీకి ఎల్లో అలర్ట్​ విధించారు.భారీ చెట్లు సైతం భవంతులపై కూలడంతో ఆయా చోట్ల భవనాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. 

ఉత్తరాఖండ్​ లో ఇద్దరి మృతి, 17 మందికి గాయాలు..

ఉత్తరాఖండ్​ లో వర్షం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించగా, 17 మందికి గాయాలయ్యాయి. కొండచరియలు విరిగిపడడంతో ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. 

కేంద్ర వాతావరణశాఖ దేశంలోని 13 రాష్ట్రాల్లో వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లతో పాటు ఉత్తరాఖండ్, తమిళనాడు, దక్షిణ పంజాబ్, హర్యానా, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, కర్ణాటక, కేరళ ఉన్నాయి.