అణుబాంబుల పేరుతో దేశ ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా?

బాంబులపై ఉన్న బూజునే ఆ దేశం దులుపుకోలేకపోతోంది! ఎగుమతి చేసే స్థాయికి భారత్​ చేరుకుంది పకడ్భందీ ప్రణాళికతో ఒడిశా అభివృద్ధి జూన 4 తరువాత కాంగ్రెస్​, బీజేడీలు కనిపించవు పద్మశ్రీ పుర్ణమాసి జానీకి పాదాభివందనం ఒడిశా కందమాల్​ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

May 11, 2024 - 12:47
 0
అణుబాంబుల పేరుతో దేశ ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా?

భువనేశ్వర్​: కాంగ్రెస్​ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జూన్​ 4 తరువాత ఈ విషయం స్పష్టం కాబోతుందన్నారు. కాంగ్రెస్​ పదే పదే పాక్​ లో అణుబాంబుల పేరు చెబుతూ దేశాన్ని, దేశ ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తోందన్నారు. పాక్​ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయని తెలిపారు. ఒడిశాలో కందమాల్​ లో ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. వేదికపై ఉన్న పద్మశ్రీ విజేత పూర్ణమాసి జానీ (కవయిత్రి–సంఘ సేవకురాలు) పాదాలను తాకి ఆశీర్వచనం తీసుకున్నారు. పూర్ణమసికి 2021లో పద్మశ్రీ లభించింది.

అనంతరం ప్రసంగించారు. పాక్​ లో ఉన్న బాంబులపై పట్టిన బూజునే దులుపుకోలేకపోతుందన్నది తెలుసుకోవాలని విపక్షాలకు చురకలంటించారు. ఆర్థిక పరిస్థితులు బాగులేక వారు అణుబాంబులను సైతం అమ్మకానికి పెట్టారన్న విషయం తెలుసుకోవాలన్నారు. కానీ భారత్​ పరిస్థితి అలా కాదన్నారు. పూర్తి దేశీయంగా ఆయుధాలు తయారు చేస్తూ ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని తెలిపారు. 

ఒడిశా అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. పకడ్బందీ ప్రణాళికలతో అభివృద్ధిని సాధిస్తామని పేర్కొన్నారు. బీజేడీ (బీజూ జనతా దళ్​) సమయం కూడా జూన్​ 4తో ముగిసిపోతుందన్నారు. ఆ పార్టీ మనుగడలో ఉండదని ప్రధాని పేర్కొన్నారు. జూన్​ 10న భువనేశ్వర్​ లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

దేశంలో అవినీతి, అక్రమార్కులకు బీజేపీ సింహాస్వప్నంలా మారిందన్నారు. రూ. 1.25 లక్షల కోట్లను కేంద్ర ఏజెన్సీలు సీజ్​ చేశాయన్నారు. తుక్డే తుక్డే గ్యాంగ్​ తో కలిసి దేశాన్ని విభజించాలని కాంగ్రెస్​ చూస్తోందని మండిపడ్డారు. దోపిడీ, బుజ్జగింపులు, రాజవంశీకుల పాలన కాంగ్రెస్​ ది అని ఆరోపించారు. పదేళ్ల క్రితం దేశంలోని పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే అన్నారు. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లతో దద్దరిల్లేదన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలో పూర్తి మార్పు తీసుకువచ్చామన్నారు. శత్రుదేశాలు భారత్​ వైపు చూసేందుకే వణికిపోయేలా చేయగలిగామన్నారు. ఇదంతా మీ ఒక్క ఓటు శక్తి తోనే అన్నది జ్ఞాపకం ఉంచుకోవాలన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మీ ఓటు శక్తిని మరోమారు బీజేపీకి ఇవ్వాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.