అత్యాధునిక సాంకేతికతతో మైనింగ్
బొగ్గు ఉత్పత్తి పెంపుదల మైనింగ్ ఖర్చులను తగ్గించే లక్ష్యం ఎండీవో, సీఐఎల్ ల కీలకపాత్ర కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిని పెంచడం, మైనింగ్ ఖర్చులను తగ్గించడం, మైనింగ్ లో ఆధునిక సాంకేతికత వినియోగానికి అడుగులు వేస్తున్నామని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మైనింగ్ డెవలపర్స్ కమ్ ఆపరేటర్స్ (ఎండీవో) ప్రాథమిక లక్ష్యాలను క్రమ బద్ధీకరించడం, కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లు బొగ్గును వెలికితీయడం, ఎగుమతులు చేసే పనిలో ఉన్నారని కేంద్ర మంత్రి వివరించారు.
కోల్ అండ్ మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఒప్పందాలకు అనుగుణంగా తవ్వకాలు, బొగ్గు వెలికితీత, పంపిణీ మొత్తాన్ని ఎండీవో, సీఐఎల్ లు పర్యవేక్షిస్తాయన్నారు. అత్యాధునిక సాంకేతికతతో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంపొందించనున్నాయని తెలిపారు. ఉత్పత్తి పెంచడంతోపాటు పునరావాసం, సమస్యలు, భూ సేకరణలు, పర్యావరణ అనుమతులు వంటి కీలక అంశాలను ఎండీవోలు నిర్వహిస్తాయన్నారు. పర్యావరణ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డులతో సమన్వయం చేసుకొని వెళ్లాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.