మెతుకు సీమలో కాషాయ ప్రభంజనం
BJP is taking steps towards victory in Medak parliamentary constituency.
- ప్రచారంలో ముందున్న ప్రశ్నించే గొంతుక రఘునందన్
- బీఆర్ఎస్ అభ్యర్థిపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
- నిర్వాసిత గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత
- కాంగ్రెస్ నుంచి నీలం మధు ప్రభావం చూపేనా?
- సొంత పార్టీలో ఆయనకు సహకరించని నేతలు
- మెదక్ పార్లమెంట్ నియోజవర్గంలో హోరాహోరీ పోరు
నా తెలంగాణ, మెదక్ ప్రతినిధి: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది.1952లో ఏర్పడిన ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు18 సార్లు(ఉపఎన్నికతో కలిపి) ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎనిమిది సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 1980లో ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి గెలిచి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. ఈ సీటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడంతో ఈ ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ నుంచి రఘునందన్‌రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీ చేస్తున్నారు. కాగా లోక్‌సభ పరిధిలో సిద్దిపేట, దుబ్బాక, మెదక్, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఇందులో కలిశాయి. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో పాటు మల్లికార్జున్, బాగారెడ్డి, ఆలే నరేంద్ర వంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయడం విశేషం.
ప్రచారం షురూ..
మెదక్ లోక్ సభ స్థానంలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందుగానే పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేసి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. లోక్ సభ నియెజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మండలాలు, మున్సిపాలిటీల వారీగా బూత్ కమిటీ ఇన్‌చార్జిలతో మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి వివరిస్తుండటంతో పాటు కేంద్రంలోని నరేంద్ర మోదీ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతూ వాటిని ప్రజలకు వివరించాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు ఆయా పార్టీల కార్యకర్తలు, ముఖ్యనాయకులతో కలిసి సమావేశాలు పెడుతూ.. ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని కోరుతున్నారు.
బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి
మూడు ప్రధాన పార్టీల్లో బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిగా, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా గుర్తింపు ఉన్న రఘునందన్ రావు బరిలో ఉన్నారు. ఆయన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దాదాపు అన్ని సెగ్మెంట్ల ప్రజలకు ఆయన సుపరిచితులు. ఇక బీజేపీ మెదక్ స్థానంను కైవసం చేసుకోవాలని ప్రణాళికలువేస్తోంది. రఘునందన్ రావు 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా, తర్వాత జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి దుబ్బాక నుంచి పోటీచేసి ఓడిపోయారు. నియోజకవర్గం పై పట్టు, గత పాలనా అనుభవం రఘునందన్‌కు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన రఘునందన్ రావు తనకున్న పరిచయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోదీ సుస్థిర పాలనను వివరిస్తూ ఓట్లు సాధించేలా పకడ్బందీ వ్యూహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. దేశంలో మోదీ హవా, రామమందిర నిర్మాణం, ఫిర్ ఏక్‌బార్ మోదీ సర్కార్ నినాదంతో ప్రజల్లోకెళ్తున్నారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు రఘునందన్ రావు. దుబ్బాక ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, తెలంగాణలో మేదీ మేనియా, అభ్యర్థిగా రఘునందన్ రావు సమర్థత ఆయనను విజయతీరాలకు చేరుస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
కాంగ్రెస్ బీసీలపై ఆశలు ..
కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి చెందిన పటాన్‌చెరు మండలం చిట్కుల్‌కు చెందిన నీలం మధును మెదక్ అభ్యర్థిగా నిలిపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మెదక్‌లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. గజ్వేల్, దుబ్బాక మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటు.. బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను కాంగ్రెస్ లో చేరేలా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పావులు కదుపుతున్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో ఇక్కడ గెలుపుపై సీఎం రేవంత్ సహా రాష్ట్ర కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. కేసీఆర్ సొంత జిల్లాలోని ఈ స్థానాన్ని ఎలాగైనా ‘హస్త’గతం చేసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాలు రచిస్తోంది. అయితే.. నీలం మధు పూర్తిగా పటాన్ చెరు నియోజకవర్గ నేతగానే జనాలకు తెలియడం మిగతా అసెంబ్లీ సెగ్మంట్లలో ఆయకు పరిచయాలు లేకపోవడం ప్రతికూల అంశం. మరోవైపు పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కాట శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం నీలం మధుకు సహకరించే పరిస్థితి లేదు. ఆయనతోపాటు పటాన్ చెరు కాంగ్రెస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు నీలం మధు వెంట ఎవరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఆయన మెదక్ స్థానంలో ఏ మేరకు ఓట్లు ఒడిసిపట్టగలరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా?
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ లోక్ సభ స్థానంలో గెలుపు ఆ పార్టీకి ఇజ్జత్ కా సవాల్ గా మారింది. ఈ మేరకు అభ్యర్థిని ఖరారు చేసిన ఆ పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉండటంతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ లేదా మాజీ సీఎం కేసీఆర్ లో ఎవరోఒకరు పోటీ చేయొచ్చన్న వార్తలు వినిపించాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈయన గతంలో సిద్దిపేట కలెక్టర్ గా పనిచేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పార్టీలో స్తబ్ధత నెలకొంది. ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం లేదు. కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్లు బీఆర్ఎస్ నుంచి అటు బీజేపీలోకి, ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. సిట్టింగ్ స్థానంలో విజయం సాధించేలా ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి గెలుపు బాధ్యతను మాజీ మంత్రి హరీశ్‌రావు తీసుకున్నారు. అయినా.. బీఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు పరిమితంగానే ఉన్నట్లు తెలుస్తున్నది.
వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు..
సిద్దిపేట కలెక్టర్ గా వెంకట్రామిరెడ్డి హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అటు మల్లన్నసాగర్, ఇటు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల కోసం భూసేకరణ జరిగింది. ఈ విషయంలో కలెక్టర్ తమకు పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయించారని కొన్ని గ్రామాలు, తక్కువ పరిహారం ఇచ్చారని కొన్ని గ్రామాల ప్రజలు వెంకట్రామిరెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారు. దాదాపు 20కి పైగా నిర్వాసిత గ్రామాల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పడే అవకాశం ఉంది. అదీగాక ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పేరు బయటకు రావడం, పోలీసులు ఆయన డబ్బును తరలించినట్లు వార్తలు రావడం కలకలం సృష్టించింది. దీంతో ఆయన గెలుపు అవకాశాలు మరిన్ని సన్నగిల్లుతున్నాయి.
మెదక్ కు మోదీ ఏమిచ్చారు?
గత ఐదేండ్లలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రధాని మోదీ ప్రభుత్వం అనేక నిధులు ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ. 655.48 కోట్ల ఖర్చుతో 41,114 ఇండ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు 38, 327 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసింది. రూ. 337.31 విడుదల చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు ఇండ్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్యానికి అమిత ప్రాధాన్యత ఇస్తూ.. ఇతోధికంగా నిధులను విడుదల చేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో చెత్త తరలింపు చేస్తూ పరిశుభ్రత పెంచడంతో పాటు సీజనల్ వ్యాధుల నివారణ కోసం కోట్లు ఖర్చు చేస్తోంది. అమృత్ పథకం కింద అటల్ పట్టణ పునరుద్ధరణలో భాగంగా రూ.135.5 కోట్లతో పట్టణాభివృద్ధికి కృషి చేశారు మోదీ. మరో రూ.68.87 కోట్లతో అమృత్ 2.0 ను అమలు చేసేందుకు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆమోదించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద 3,701 మందికి రూ. 57.24 కోట్ల రుణ సదుపాయం కల్పించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద పట్టణ జీవనోపాధి మిషన్ లో భాగంగా1,454 స్వయం సహాయక సంఘాల ద్వారా 7,642 మందికి బ్యాంక్ రుణాలు అందించి జీవనోపాధి మెరుగుదలకు సహకారం అందించారు. నియోజకవర్గంలో 1,667 మందికి ఉపాధి శిక్షణ కల్పించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద పట్టణ జీవనోపాధి మిషన్ లో భాగంగా 1,454 స్వయం సహాయక సంఘాల ద్వారా 7,642 మందికి బ్యాంక్ రుణాలు అందించి జీవనోపాధి మెరుగుదలకు సహకారం అందించారు. నియోజకవర్గంలో 1,667 మందికి ఉపాధి శిక్షణ కల్పించారు.