పీఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్
అనారోగ్యంతో చికిత్సపొందుతూ ఏయిమ్స్ లో తుదిశ్వాస
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పీఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ (69) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈయన మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు.ఆయన మృతి తీరని లోటన్నారు. డెబ్రాయ్ తో కలిసి పంచుకున్న చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఆయన దూరదృష్టి నిర్ణయాలను కొనియాడారు. డా. బిబేక్ దేబ్రాయ్ గొప్ప పండితుడు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత, ఇతర విభిన్న రంగాలలో బాగా ప్రావీణ్యం కలవారన్నారు. ఆయన పనితీరుతో చెరగని ముద్ర వేశారని చెప్పారు. దేబ్రాయ్ కృషి వల్లే ప్రాచీన గ్రంథాలపై పనిచేస్తున్నామని, వీటిని యువతకు అందుబాటులో ఉంచడం ఆయనకు అత్యంత ఇష్టమని ప్రధాని మోదీ తెలిపారు. అనారోగ్యం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతూ మృతిచెందారు.
డా. బిబేక్ దేబ్రాయ్ (69) రామకృష్ణ మిషన్ స్కూల్ లో చదివారు. ప్రెసిడెన్సీ కాలేజీ కోల్ కతా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ట్రినిటీ కాలేజీ (కేంబ్రిడ్జ్)లో విద్యనభ్యసించారు. అనంతరం పలు కాలేజీల్లో ఎకనామిక్స్ విభాగంలో పనిచేశారు. ఆర్థికమంత్రిత్వ శాఖ యూఎన్ డీపీ ప్రాజెక్టు డైరెక్టర్ గా విధులు నిర్వహించారు. నీతి ఆయోగ్ సభ్యుడుగా కూడా ఉన్నారు. ఈయన అనేక పుస్తకాలు, కథనాలు రాశారు. వార్తా పత్రికలకు కన్సల్టెంట్ ఎడిటర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నారు.