ఎమిరేట్స్​ విమానం ఢీకొని 36 రాజహంసలు మృతి

ఆవేదన వ్యక్తం చేసిన ఆర్​ఎడబ్ల్యూడబ్ల్యూ పవన్​ శర్మ

May 21, 2024 - 18:08
 0
ఎమిరేట్స్​ విమానం ఢీకొని 36 రాజహంసలు మృతి

ముంబై: ముంబైలో ఎమిరేట్స్​ కు చెందిన విమానాన్ని ఢీకొన్న ఘటనలో 36 ఫ్లెమింగో (రాజహంస) పక్షులు మృతి చెందినట్లు వన్యప్రాణుల సంక్షేమ సంఘం (ఆర్​ఎడబ్ల్యూడబ్ల్యూ) సభ్యుడు పవన్​ శర్మ మంగళవారం అటవీశాఖకు ఫిర్యాదు చేశారు. ఘాట్‌కోపర్‌లో ఆకాశ మార్గాన  ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కానీయరాదన్నారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తమకు ఫిర్యాదులందాయన్నారు. ఘట్​ కోపర్​ లోని వేర్వేరు ప్రాంతాల నుంచి రాజహంసలు చనిపోయినట్లు వాటి మృతదేహాలతో కూడిన ఫోటోలను, వీడియోలను ప్రజలు పంపుతున్నారని పేర్కొన్నారు. దీని ఆధారంగా మొత్తం 36 పక్షులు చనిపోయాయని గుర్తించామని పవన్​ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన వాటిని పోస్ట్​ మార్టం కోసం పంపామని తెలిపారు.

విమానాన్ని ఢీ కొట్టినా సురక్షితంగా ల్యాండ్​ అయ్యింది. ప్రయాణికులు కూడా క్షేమంగానే ఉన్నారని తెలిపారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ కూడా వీటిని స్వాధీనం చేసుకుందని తెలిపారు. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా దాచిపెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ సమతుల్యత సాధించాలంటే జీవకోటి మనుగడలో ఓ భాగమైన పక్షులు కూడా కీలకమన్నారు. ఇంతపెద్ద ఘటనపై నోరు మెదపకుండా నొక్కి ఉంచడంపై పవన్​ శర్మ మండిపడ్డారు.