కల్తీసారా ఘటనలో 37కు పెరిగిన మృతులు

సీఎం స్టాలిన్​ ఉన్నతస్థాయి సమీక్ష

Jun 20, 2024 - 13:34
 0
కల్తీసారా ఘటనలో 37కు పెరిగిన మృతులు
  • సీబీసీఐడీకి కేసు అప్పగింత
  • కలెక్టర్​, ఎస్పీ సహా 9మంది ఎక్సైజ్​ పోలీసుల సస్పెండ్​
  • మృతులకు రూ. 10 లక్షల ఎక్స్​ గ్రేషియా ప్రకటన
  • దుమ్మెత్తిపోసిన బీజేపీ అధ్యక్షుడు అన్నామలై

చెన్నై: తమిళనాడు కళ్లకురిచ్చి మండలం కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగి మృతిచెందిన వారి సంఖ్య 37కు పెరిగింది. దీంతో ప్రభుత్వం గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. సీఎం స్టాలిన్​ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. మృతులకు సంతాపం తెలిపిన సీఎం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టిపరిస్థితుల్లోను వదిలేదన్నారు. మృతిచెందిన వారికి రూ. 10 లక్షల ఎక్స్​ గ్రేషియా ప్రకటించారు. కల్తీసారా తయారీకి పాల్పడ్డ నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చికిత్సపొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలందించాలని ఆరోగ్యశాఖకు సూచించారు. కల్తీ ఘటనపై సీబీసీఐడీకి దర్యాప్తునకు ఆదేశించారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం స్టాలిన్​ స్థానిక కలెక్టర్​, ఎస్పీలపై సస్పెన్షన్​ వేటు వేశారు. వీరితోపాటు మరో 9మంది ఎక్సైజ్​ శాఖ పోలీసులను సస్పెండ్​ చేశారు. 

కాగా ఈ ఘటనపై తమిళనాడులో విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై కల్తీసారా మృతులకు నివాళులర్పిస్తూనే వారి కుటుంబసభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. సీఎం స్టాలిన్​ ప్రభుత్వం తీసుకుంటున్న పనికిమాలిన చర్యల వల్లే కల్తీ మాఫియా రెచ్చిపోతోందన్నారు. గతేడాది కూడా 22 మంది కల్తీ సారా కాటుకు బలైనా డీఎంకే గుణపాఠం నేర్చుకోలేదన్నారు. డీఎంకే తమిళనాడులో దుష్పరిపాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. 

ఆసుపత్రిలో మరో 90 మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితులు విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. పరిస్థితి విషమించిన వారిని సేలం, విల్లుపురం, పుదుచ్చేరిలోని ఆసుపత్రులకు రిఫర్​ చేశారు. 

కల్తీసారా ఘటనలో ఇప్పటివరకూ తమిళనాడు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 200 లీటర్ల మిథనాల్​ ను స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం ల్యాబ్​ కు పంపించారు. ల్యాబ్​ నుంచి రిపోర్ట్​ రాగానే మృతికి సంబంధించిన అసలు కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. 

మరోవైపు కల్లీసారా మృతుల ఘటనపై ఏఐఏడీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై అత్యవసర విచారణ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. జూన్​ 21న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.