గ్వాదర్​ పోర్టులో కాల్పులు ఏడుగురు మృతి, ఒకరికి గాయాలు

చైనా ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డంకులు

May 9, 2024 - 13:30
 0
గ్వాదర్​ పోర్టులో కాల్పులు ఏడుగురు మృతి, ఒకరికి గాయాలు

ఇస్లామాబాద్​: పాక్​ లో చైనా కలల ప్రాజెక్టుకు ఉగ్రవాదుల రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. బుధవారం అర్థరాత్రి మరోమారు పాక్​ లోని గ్వాదర్​ పోర్టులో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రదాడిలో ఏడుగురు కూలీలు మృతిచెందారు, ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది. 

మార్చి 20న కూడా గ్వాదర్​ పోర్టులో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా ఈ కాల్పులపై అప్పట్లో చైనా పాక్​ పై తీవ్రంగా మండిపడింది. ప్రాజెక్టును నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది. తమ నిధులు తమకు వాపస్​ చేయాలని డిమాండ్​ చేసింది. 

అయితే అర్థరాత్రి సరబంద్​ లోని ఫిష్​ హార్బర్​ జెట్టి సమీపంలో కూలీల నివాస గృహాలపై బలూచ్​ ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు మక్రాన్​ డివిజన్​ కమిషనర్​ సయీద్​ అహ్మద్​ ఉమ్రానీ తెలిపారు. దాడిలో మృతి, గాయపడిన వారి వివరాలు తెలియరాలేదన్నారు. ఉగ్రవాదులు ఇంకా హార్బర్​ లో ఉన్నట్లు తెలిపారు. భద్రతా బలగాలను వారిని చుట్టుముట్టాయన్నారు. హార్బర్​ పూర్తిగా తనిఖీ నిర్వహించాకే మిగతా విషయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

కాగా ఇటీవల సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన వార్షిక భద్రతా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2023లో పాకిస్థాన్‌లో 789 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 1,524 మంది మరణించగా, 1,463 మంది గాయపడ్డారు. గత ఆరేళ్లలో ఇదే అత్యధిక రికార్డు కావడం విశేషం.

ఏది ఏమైనా ఇలాంటి దాడుల వల్ల చైనా–పాక్​ ల దోస్తీ కాస్త శత్రుత్వాన్ని సంతరించుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.