శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజలు ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రయత్నాలను తిరస్కరిస్తారని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జీ జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అక్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మోహన్ లాల్ భగత్ నామినేషన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్–ఎన్సీలకు ప్రజలు బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. ఈ రెండు పార్టీలు అవినీతి, ఉగ్రవాదం, బంధుప్రీతి, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. వీరి చర్యలు జమ్మూకశ్మీర్ శాంతి, అభివృద్ధి చర్యలకు విఘాతం కలిగిస్తున్నాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం ఈ రాష్ర్ట పూర్తి విజన్, అభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు. ప్రజలంతా ఒక్కసారి సావధానంగా ఆలోచించి మోదీ విజన్ కు మద్ధతు తెలపాలని కిషన్ రెడ్డి కోరారు.
జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఇచ్చిన ప్రతీ ఒక్కహామీని నెరవేర్చే సామర్థ్యం ఉన్న పార్టీ బీజేపీనే అన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి ఫలాలు, తీసుకున్న చర్యల వల్ల ప్రజలు శాంతియుత మార్గంలో అభివృద్ధిని కాంక్షలో భాగస్వాములవడం సంతోషకరమన్నారు. మోహన్ లాల్ భగత్ కు ఓటు వేసి గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అనంతరం అక్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మోహన్ లాల్ భగత్ తో కలిసి ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.