తీరం దాటిన దానా
Dana beyond the coast
ప్రాణ, ఆస్తి నష్టం లేకపోవడంతో
ఉపిరి పీల్చుకున్న అధికారులు
ముందస్తు చర్యలతో తప్పిన భారీన ముప్పు
భువనేశ్వర్: దానా తుపాను గురువారం అర్థరాత్రి ఒడిశా తీరాన్ని తాకింది. ఉదయం శుక్రవారం ఉదయం 5 గంటల వరకు తుపాను ప్రభావం కొనసాగింది. అనంతరం కాస్త శాంతించింది. భితాకర్ కనికా, భద్రక్ జిల్లాలో తుపాను తీరాన్ని తాకింది. తుపాను తీరాన్ని తాకినప్పుడు 110 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఆర్థిక నష్టాన్ని కూడా ముందస్తు చర్యలతో భారీగా నివారించగలిగారు. ఉదయం 8 గంటల వరకు దానా తుపాను తీవ్రత ఒడిశాలో 10 కి.మీ. తగ్గింది. దీంతో విమానాలు, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 5.84 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించినట్లు సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలిపారు.
కొన్నిచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దారికి అడ్డంగా చెట్లు పడిపోయాయి. తుపాను తీవ్రత తగ్గాక సహాయక బృందాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి రహదారులపై విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించాయి. ఆయా విభాగాల అధికారులు విద్యుత్ ను పునరుద్ధరించే చర్యలు తీసుకున్నారు. రాత్రి వరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ ను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్, ఛత్తీస్ గఢ్, తమిళనాడులో కూడా కనిపించింది. పశ్చిమ బెంగాల్ లో 83వేల మందిని తీర ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించారు.