అధికారంలోకి రాగానే ఉగ్ర నేతల విడుదల
జమ్మూకశ్మీర్ విముక్తికి పాక్,ఆఫ్ఘాన్ లతో కుయుక్తులు
భారత్ లోనూ ఏబీటీ మాడ్యూల్ ఏర్పాటుకు ప్రయత్నం
ఇంటలిజెన్స్ అప్రమత్తతో తప్పిన ముప్పు
బంగ్లాలో దేవాలయాలు, హిందువులపై వరుస దాడులు
కళ్లుమూసుకున్న నోబెల్ గ్రహీత
వరదల్లో కోట్లాది మందికి ఇస్కాన్ ఉచిత భోజనాలు
పథకం ప్రకారమే హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన ఉగ్ర నాయకులు
ఉగ్రనాయకుల విడుదల సంతకాలకే పరిమితమైన తాత్కాలిక ప్రధాని
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: బంగ్లాదేశ్ లో హిందువులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను చూస్తూ తాత్కాలిక యూనస్ ప్రభుత్వం కీలుబొమ్మ పాత్రను వహిస్తుంది. ఇస్కాన్ మత గురువు చిన్మోయ్ దాస్ అరెస్టు, బెయిల్ రాకపోవడంతో నిరసలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు, మూడు రోజులుగా హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం అర్థరాత్రి ఓ దేవాలయాలన్ని తగులబెట్టి దోచుకునే ప్రయత్నం చేశారు. దేవాలయంపై భారీగా ముష్కరులు రాళ్లు రువ్వారు. ఆ సమీపంలోనే ఉన్న హిందువుల ఇళ్లపై రాళ్లదాడులకు పాల్పడ్డారు. శాంతియుత నిరసనలకు దిగుతున్న హిందువులపై భారీ ఎత్తున దాడులు చేయాలని బహిరంగంగానే పిలుపునిస్తున్నారు. హిందువులను ఊచకోత కోయాలనే వీడియోలు ప్రస్తుతం మీడియాలో, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా దర్శనం ఇస్తున్నా యూనస్ ప్రభుత్వం మాత్రం ఈ దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమవుతుంది.
రహ్మానీ విడుదల.. జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తివేత..
తాత్కాలిక ప్రధానిగా ఉన్న మహ్మద్ యూనస్ (నోబెల్ గ్రహీత)ను పథకం ప్రకారమే గద్దెనెక్కించారనే ఆరోపణలున్నాయి. ఆయన పదవిలోకి రాగానే కొద్దిరోజుల్లోనే అల్ ఖైదాతో సంబంధాలున్న (ఏబీటీ) అన్సరుల్లా బంగ్లా టీమ్ జిహాదీ చీఫ్ జషీముద్దీన్ రహ్మానీ జైలు నుంచి విడుదలయ్యారు. జమాతే ఇస్లామీ అనే ఉగ్ర సంస్థపై నిషేధం ఎత్తివేశారు. బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లాహిల్ అమన్ అజ్మీ, న్యాయవాది అహ్మద్ బిన్ క్వాసెమ్ లను విడుదల చేయించారు. వీరంతా భారత్ కు బద్ధ వ్యతిరేకులు. ఇస్కాన్ ఒక మతోన్మాద సంస్థగా యూనస్ అభివర్ణించారు. వీరంతా విడుదలై వెంటనే భారత్ కు వ్యతిరేకంగా జిహాద్ కు పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్ ను విముక్తి చేయాలంటే తమకు సహకరించాలని పాక్,ఆఫ్ఘానిస్థాన్ లను బహిరంగంగానే కోరారు.
వరదల్లో ఇస్కాన్ సాయం మరిచిన కేర్ టేకర్ యూనస్..
బంగ్లాదేశ్ లో గతంలో వరదలు చోటు చేసుకుంటే ఇదే సంస్థ తన 50 సంస్థల ద్వారా ఎన్నో రోజులు మతం చూడకుండా ఎంతోమందికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేసిన విషయాన్ని పూర్తిగా మరిచిపోయారీ కేర్ టేకర్ యూనస్. సమయం గడిచే కొద్దీ తన ఉగ్రవాదులతో, వారిని పెంచి పోషిస్తున్న దేశాలతో అంటకాగి కశ్మీర్ కు స్వాతంత్ర్యం కల్పించాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు భారత ఇంటలిజెన్స్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఏబీటీ మాడ్యూల్ పై ఇంటలిజెన్స్ పంజా..
ఏబీటీ ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ. భారత్ లోనూ వీటి మూలాలున్నాయని ఇంటలిజెన్స్ సమాచారంతో ఎన్ ఐఎ, భద్రతాదళాలు, పోలీసుల సంయుక్త చర్యలకు దిగి ఈ సంస్థ కార్యకలాపాలను అడ్డుకోగలిగారు. ఈ సందర్భంగా భారత్ లో వీరి సానుభూతిపరులు వందకుపైగానే ఉన్నట్లు గుర్తించారు. ఈ సంస్థ బంగ్లాదేశ్ లో ఓ పెద్ద బ్యాంకు దోపిడీ కేసులో కూడా పాల్గొంది. ముగ్గురు బ్యాంకు సిబ్బంది మరణించారు. రహ్మానీని అరెస్టు చేసి కారాగారానికి తరలించారు. ఈ దోపిడీ కేసు 2015కు సంబంధించినది. లష్కరే తోయిబా, ఏబీటీకి సన్నిహిత సంబంధాలున్నట్లు భారత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. వీరు పశ్చిమబెంగాల్ లో మాడ్యుల్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ముందుగా అక్రమ చొరబాట్లు కొనసాగించి అటు పిమ్మట తమ మాడ్యుల్ ను ఏర్పాటు చేసుకొని భారత్ లో అలజడులు సృష్టించాలనేదే ఈ ఉగ్ర సంస్థ లక్ష్యమని ఇంటలిజెన్స్ గుర్తించింది. గౌహాతి, అసోం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, మేఘాలయ లలో వీరి కార్యకలాపాల కోసం వందమందితో మాడ్యూల్ ను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వందమంది మాడ్యూల్ లో 60 మందిని అరెస్టు చేయగా ఇందులో 30మంది బంగ్లాదేశీయులే ఉన్నారు.
ఉగ్ర స్క్రిప్ట్ సంతకాలు చేస్తున్న తాత్కాలిక ప్రధాని..
షేక్ హసీనా ప్రభుత్వాన్ని పథకం ప్రకారం పడగొట్టడం, అటుపిమ్మట విద్యార్థి నాయకుల సహాయంతో తాత్కాలిక ప్రధానిగా యూనస్ అధికారంలోకి రావడం, అటు తరువాత ఉగ్రనాయకుల విడుదల, సంస్థలకు స్వాతంత్ర్యం కల్పించడం, హిందువులు, దేవాలయాలపై వరుస దాడులకు ప్రేరేపించడం వెనుక యూనస్ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఘటనలన్నీ చూస్తుంటే బంగ్లాదేశ్ లో ఇప్పుడిప్పుడే ఎన్నికలు జరిగేలా లేవని తెలుస్తోంది. ఉగ్ర సంస్థలు స్క్రిప్ట్ రాస్తుండగా ఉగ్రవాద నేతలను జైలు నుంచి విడిపించడంలో యూనస్ ప్రభుత్వం సంతకాలు చేస్తుందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి.
ఏది ఏమైనా ఉగ్రవాదులతో అంటకాగిన పాక్ పరిస్థితులు బంగ్లాదేశ్ లో పునరావృతం అయ్యేందుకు ఎంతోకాలం పట్టేలా లేదు. ఇప్పటికిప్పుడు హిందువులపై జరుగుతున్న దాడులను అడ్డుకోకుంటే ఆ దేశానికి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ముంగిట్లో ఉన్నట్లేనని ఆ దేశ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుండటం గమనార్హం.