భారత ప్రభుత్వ సహాయంతో భూటాన్ లో దవాఖాన నిర్మాణం
ప్రారంభించిన ప్రధాని మోదీ.. మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’అవార్డు.. భూటాన్ లో ముగిసినభారత ప్రధాని పర్యటన
నా తెలంగాణ, ఢిల్లీ: భారత ప్రభుత్వ నిధులతో భూటాన్ లో నిర్మించిన ‘మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రి’ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ ఆసుపత్రి భూటాన్ ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించేందుకు దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల భూటాన్ పర్యటనను ముగించుకొని శనివారం ఢిల్లీకి ప్రధాని మోదీ పయనమయ్యారు. మోదీకి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ వీడ్కోలు పలికేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వాంగ్చుక్కు కృతజ్ఞతలు తెలిపారు. భూటాన్ప్రజల ఆప్యాయత, ఇక్కడి ప్రభుత్వం ఆతిథ్యానికి కృతజ్ఞుడనని ప్రధాని మోదీ తెలిపారు. భూటాన్ పర్యటన చాలా ప్రత్యేకమైనదన్నారు. భారత్–భూటాన్ మధ్య స్నేహం మరింత బలోపేతం అవడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ అవార్డు దక్కడం సంతోషకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.