రాజ్యాంగం భారత్​ కు గర్వకారణం

లోక్​ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Dec 14, 2024 - 18:59
 0
రాజ్యాంగం భారత్​ కు గర్వకారణం

ప్రపంచదేశాల్లో ప్రత్యేక గౌరవం
ఆర్టికల్​ 370 పునరుద్ధరిస్తే దేశ ఐక్యతకు ముప్పు
రాజ్యాంగ విజయానికి ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రజాస్వామ్య దేశాల్లో భారత రాజ్యాంగం అంటే ప్రత్యేక గౌరవం ఉందని, ఇది దేశ వాసులకు గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టికల్​ 370ని పునరుద్ధరిస్తే దేశ ఐక్యతకు విఘాతం కలిగిస్తుందని మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగం 75 యేళ్ల ఘనత అని భారత రాజ్యాంగం సామాన్యమైనది కాదన్నారు. ఇన్నేళ్ల సుధీర్ఘ ప్రయాణంలో రాజ్యాంగం గొప్ప విజయాన్ని సాధించిందని ఇందుకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 

ప్రపంచదేశాలకు చాటి చెప్పారు..
రాజ్యాంగంపై రెండో రోజు శనివారం పార్లమెంట్​ లో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం సభకు హాజరై ప్రసంగించారు. దేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి తమకు అధికారం, అవకాశం కల్పించారని అన్నారు. తాము నిరంతరం భారతదేశ ఐక్యతను బలోపేతం చేస్తామన్నారు. ప్రజాస్వామ్యానికి తల్లిగా భారత రాజ్యాంగం రూపొందిందన్నారు. ఎన్నో శతాబ్ధాలుగా కొనసాగుతున్న చరిత్రను బాబా సాహేబ్​ అంబేద్కర్​ రాజ్యాంగంగా మలిచి భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పారని కొనియాడారు. 

మహిళా శక్తి పాత్ర కీలకం..
రాజ్యాంగ నిర్మాణంలో, రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో మహిళా శక్తి కూడా పాత్ర పోషించిందన్నారు. జీ–20లో అదే స్ఫూర్తిని కొనసాగించామన్నారు. మహిళలు అభివృద్ధి చెందాలన్నది తమ విధానమన్నారు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నారీ శక్తి వందన్​ చట్టాన్ని ఆమోదించామన్నారు. మహిళల సాధికారతకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు.  రాష్ర్టపతి పదవిలోనూ గిరిజన మహిళను గౌరవించుకుంటున్నామని మోదీ చెప్పారు. రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నామన్నారు. మహిళా ఎంపీల సంఖ్య నిరంతరం పెంచుకుంటున్నామని తెలిపారు. నేడు భారత్​ లో అన్ని రంగాల్లోనూ మహిళల పాత్రను కీలకం చేశామని తెలిపారు. అంతరిక్షంలోనూ మహిళలు సత్తా చాటడం దేశానికి గర్వకారణమన్నారు. 

ఐక్యతతోనే అభివృద్ధి ఫలాలు..
140 కోట్ల దేశ ప్రజల సంకల్పం, రాజ్యాంగం ఉద్దేశించిన దారిలో నడుస్తూ ప్రస్తుతం దేశం శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. త్వరలోనే భారత్​ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలుస్తుందన్నారు. ఇందుకు ప్రతీ ఒక్కరి ఐక్యత చాలా ముఖ్యమన్నారు. ఐక్యతతో సాధించిన, సాధించే ఫలితాలను కూడా రాజ్యాంగంలో వివరించారన్నారు. దేశంలోని విభిన్న ప్రజాభిప్రాయాలు, మతాలు, కులాలు, మనుషులను ఏకీకృతం చేయగలిగితే దేశ అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పారు. ఒకరినొకరు గౌరవించుకుంటేనే ఐక్యతా భావం పెంపొందుతుందన్నారు. 

దేశ సమైక్యతను దెబ్బతీసే ప్రయత్నం..
స్వాతంత్య్రానంతరం వక్రీకరించిన మనస్తత్వం, స్వార్థం వల్ల దేశ ఐక్యత అనే ప్రాథమిక సూత్రంపై అతిపెద్ద దాడి జరిగిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ సమైక్యతను దెబ్బతీసే అన్ని మూలాలను కొందరు వెతుకుతున్నారని మండిపడ్డారు. భారత్​ భిన్నత్వంలో ఏకత్వమన్న విషయాన్ని మరిచి ఇంకా బానిసత్వ సంకెళ్లలో మగ్గాలనే ప్రయత్నాలకు తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నూతన భారత్​ నిర్మాణంలో భాగస్వాములు కావాలి..
జీఎస్టీ, రేషన్​ కార్డు, హెల్త్​ కార్డులు, పెన్షన్​ లు, మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగం ఇలా అన్ని రంగాల్లోనూ సత్ఫలితాలను సాధిస్తూ తమ ప్రభుత్వానికి నిరుపేదలకు ఆర్థిక పరిపూర్ణత చేకూర్చాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతీ ఒక్కరూ విద్యనార్జించి నూతన భారత్​ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.