కాంగ్రెస్ మంత్రి పీఏ హెల్పర్ ఇంట్లో నోట్ల కట్టలు
25 Crore Cash Found In Help's House In Raids Linked To Jharkhand Minister
రాంచీ: జార్ఖండ్‌లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. అదంతా లెక్కల్లోకి రాని సొమ్ము అని, ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొమ్ము రూ.20 కోట్లుపైనే ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్వర్గాలు మీడియాకు వెల్లడించాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రాజధాని నగరం రాంచీలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ కేసులో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర రామ్ 2023లో అరెస్టయ్యారు. దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన10కి పైగా ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మంత్రి(గ్రామీణాభివృద్ధి శాఖ)అలంఘీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్‌కు సహాయకుడికి చెందినదిగా భావిస్తున్న ఇంట్లో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఒక గదిలో కరెన్సీ కట్టలు పేర్చి ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
అవినీతి ముగియలేదు: బీజేపీ
నోట్ల కట్టలు పట్టుబడిన ఘటనపై బీజేపీ స్పందించింది. ‘‘జార్ఖండ్‌లో అవినీతి ముగిసిపోలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా సదరు వ్యక్తులు దీనిని ఉపయోగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’’ అని కోరింది. పలు ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలకు పాల్పడ్డారని, రూ.100 కోట్ల మేర కూడబెట్టారని వీరేంద్రపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలతో ఆయన జరిపిన లావాదేవీల వివరాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను ఇదివరకే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగానే సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.