ఉగ్రవాదులకు సహాయం ఏడుగురిపై ఉపా చట్టం కింద చార్జీషీట్ దాఖలు
Charge sheet filed under UPA Act on providing assistance to terrorists

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న రెండు కేసుల్లో శనివారం ఏడుగురిపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. సీనియర్ పోలీసు అధికారి సందీప్ మెహతా మాట్లాడుతూ.. నిందితులు మొత్తం ఏడుగురు ఉగ్రవాదులకు ఆహార పదార్థాలతో పాటు ఇతర మార్గాల్లో సహాయం చేసేవారని తెలిపారు. నిందితులపై దోడాలోని ఎన్‌ఐఏ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసినట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని, దోషులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడం ద్వారా శాంతి భద్రతలను పరిరక్షించాలన్న పోలీసుల ధృడనిశ్చయంతో ఉన్నారన్నారు. గండోహ్ కేసులో ముగ్గురిపై ఉపా సెక్షన్ల కింద, భదర్వా కేసులో నలుగురిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఉగ్రవాదులకు వీరు సహాయం చేశారని గుర్తించినట్లు తెలిపారు.