సీఏఏపై విపక్షాలవి నీచ రాజకీయాలు

2019లోనే ఆమోదం.. కోవిడ్​ వల్ల ఆలస్యం. నాలుగేళ్లలో 41 సార్లు చట్టంపై వివరించా. మోదీ మాటిస్తే వెనక్కి తగ్గేదే లే. చిట్​చాట్ లో అమిత్​షా

Mar 14, 2024 - 16:20
 0
సీఏఏపై విపక్షాలవి  నీచ రాజకీయాలు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: సీఏఏపై అన్ని విపక్షాలు, ఓవైసీ, కేజ్రీవాల్, మమత తదితర నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. గురువారం సీఏఏపై షా మీడియాతో చిట్ చాట్ లో.. 2019 లోనే సీఏఏ తీసుకువస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందని, పాక్, బంగ్లా దేశ్ ల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని వాగ్దానాల్లో హామీ ఇచ్చామన్నారు. 2019లోనే ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిందని, కోవిడ్​ నేపథ్యంలో జాప్యం జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. ప్రభుత్వం ముందునుంచే ఈ బిల్లుపై చెప్పిందన్నారు. సమయం, రాజకీయం అనేవి ప్రశ్నలు కావన్నారు. విపక్షాలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఇలా చేయొద్దని, దేశ ప్రజలు ప్రతిపక్షాల నీచ రాజకీయాలను గమనిస్తున్నారని అన్నారు. 

సీఏఏ అమలు బీజేపీకి రాజకీయం కాదు.. విపక్షాలదే రాజకీయం..

నాలుగేళ్లలో సీఏఏ అమలు చేస్తామని తాను 41 సార్లు చెప్పానని ఎన్నికలకు ముందు సీఏఏను అమలు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నట్లు షా గుర్తుచేశారు. 2014 నుంచే పౌరసత్వ చట్టం లభించే వెసులుబాటు ఈ బిల్లు ద్వారా కల్పించామన్నారు. బీజేపీ కోసం ఈ చట్టం అమలు రాజకీయం కాదన్నారు. అప్ఘాన్, పాక్, బంగ్లాదేశ్​ మూడు తరాల శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని ప్రధాని మాటిచ్చారన్నారు. ప్రధాని మాటిస్తే వెనక్కి తగ్గేదే లేదన్నారు. విపక్షాలు సర్జికల్​ స్ట్రైక్స్​, ఎయిర్​స్ట్రైక్స్ పై కూడా రాజకీయాలకు పాల్పడ్డాయని వాటికి దేశ హితం ఏ మాత్రం పట్టదని అన్నారు. 370 ఆర్టికల్ ను రద్దు చేస్తామని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదని దీనిపై కూడా విపక్షాలు ఎంత రాద్ధాంతం చేశాయో చూశారన్నారు. కానీ తాము ఇచ్చిన మాటను ఎన్నటికీ తప్పలేదన్నారు. ఎన్ని అవాంతరాలు, అభ్యంతరాలు ఎదురైనా భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. 

వెనక్కి తిరగబోం.. అమలు చేసి తీరుతాం..

విపక్షాలు మాట ఇస్తే పాటించవనే చరిత్ర వారిదని, బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ మాటిస్తే అమలు చేసి తీరుతారని అందుకోసం ఎన్ని అవాంతరాలు ఎదురైన వెనుదిరగబోమని అమిత్​ షా అన్నారు. 2019లో సీఏఏపై ఉన్న అనుమానాలను ఇన్నేళ్లలో ఎన్నో వేదికల ద్వారా నివృత్తి చేశానని తెలిపారు. అయినా విపక్ష పార్టీలకు దేశ క్షేమం రుచించడం లేదని మండిపడ్డారు. సీఏఏ లో పౌరసత్వాన్ని తీసుకోవాలనే అంశం ఎక్కడా లేదని, మైనార్టీ, వలస వచ్చిన వారి క్షేమం కోసమే పౌరసత్వం అందజేస్తామని అన్నారు. హిందూ, సిక్కులు, బౌద్ధులు, పార్సీ, జైన శరణార్థులకు పౌరసత్వం అనేది వారి హక్కు అని అన్నారు. ఈ చట్టంలో ముస్లింలకు చోటు కల్పించలేదనే విషయంపై షా మాట్లాడారు. ధర్మం ప్రకారం దేశాన్ని విడగొట్టడమే చాలా పెద్ద తప్పిదమైన నిర్ణయమని ఆ సమయంలో హిందూవులు పెద్ద సంఖ్యలో అక్కడే ఉండిపోయారని, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్​ వారందరినీ ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వెనక్కి రావచ్చని చెప్పిందని షా గుర్తు చేశారు. ఇప్పుడేమో తాము చట్టం అమలు చేస్తే చేతులెత్తేస్తున్నారని, ఆ సమయంలో ఇచ్చిన మాటలు కల్లబొల్లి మాటలేనని స్పష్టం అవుతోందన్నారు. కానీ తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. 

ముస్లింల కోసమే విభజన.. వారికి చోటు భారత్, హిందు సమాజం ఎక్కడకు పోవాలన్న షా..

ముస్లింల కోసమే ఆ సమయంలో విభజన జరిగిందని, ఇక ముస్లింలకు ఇక్కడ కూడా చోటు కల్పిస్తే ఇంకా భారత్​ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. విభజన జరిగినప్పుడు పాక్ లో 23 శాతం హిందువులు ఉండేవారని అన్నారు. కానీ ప్రస్తుతం వారి సంఖ్య 3.7 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. మిగతా వారంతా ఏమయ్యారని ప్రశ్నించారు. వీరిని తీవ్ర అవమానాలకు గురి చేసి ధర్మ పరివర్తనం చేయించారని షా మండిపడ్డారు.1951లో బంగ్లాదేశ్​ లో 22 శాతం హిందువులు ఉండేవారన్నారు. ప్రస్తుతం 2011 ప్రకారం 10 శాతం మాత్రమే హిందువులు ఉన్నారని అన్నారు. 1952 కంటే ముందు 2 లక్షల మంది హిందువులు ఉండేవారని, నేడు కేవలం 500 మంది మాత్రమే మిగిలారని అన్నారు. అఖండ భారత్ గా ఉన్నప్పుడు వారంతా మన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లేనని అన్నారు. 
ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు..

గడువు నిర్ధారించలే..

సీఏఏలో భారత పౌరసత్వం మంజూరుకు గడువు నిర్ధారించలేదని అందుకే పౌరసత్వం పొందాలనుకునేవారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 1947 ఆగస్టు 15 నుంచి 2014 వరకు ఎవ్వరు వచ్చినా దానిపై విచారణ చేపట్టే పౌరస్మృతికి అనుమతిస్తామన్నారు. ప్రతిపక్షాలు సరిహద్దుల ద్వారా వస్తున్న ఉగ్రవాదం, రోహింగ్యాలు లాంటి విషయాలపై మాట్లాడరని కేవలం హిందు శరణార్థులపైనే వీరు విషం గక్కుతున్నారని అన్నారు. వీరంతా హిందు వ్యతిరేకులని అన్నారు. ధర్మం పేరుతో ఆ దేశాల్లో ఉన్న హిందు మహిళలపై జరిగిన అత్యాచారాలపై మన భారత పార్లమెంట్​వినకపోతే, ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారని, ఎవరు వింటారని మండిపడ్డారు. 

అఖండ భారత్​ను ముక్కలు చేసిన కాంగ్రెస్​..

దేశ విభజనను వీరంతా కోరుకోలేదని కాంగ్రెస్​పార్టీ ఆలోచించకుండా విభజనకు పాల్పడిందని, అఖండ భారత్ ను ముక్కలు ముక్కలు చేసిందని మండిపడ్డారు.75 ఏళ్లుగా హిందు శరణార్థులు అనుభవిస్తున్న నరకాన్ని, వారి ఈతి బాధలను తొలగించే సమయం ఆసన్నమైందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సీఏఏ అమలు కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.