Kishanreddy: తెలంగాణలో కొత్తగా రాహుల్​ గాంధీ ట్యాక్స్​

Congress party is collecting taxes in the name of Rahul Gandhi within 100 days of coming to power

Mar 5, 2024 - 14:18
 0
Kishanreddy: తెలంగాణలో కొత్తగా రాహుల్​ గాంధీ ట్యాక్స్​
  • నరేంద్ర మోదీ విశ్వనాయకుడు

  •  ఆయన తెలంగాణ అభివృద్ధికి ఎంతో చేశారు: కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి

  •  కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపద దోచుకున్నది

  •  కాంగ్రెస్​ సర్కారు వచ్చినా పాలనలో మార్పు లేదు

  •  బిల్డర్లు, రియల్టర్ల వద్ద ‘రాహుల్’ ట్యాక్స్ వసూళ్లు మొదలయ్యాయి

  •  బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలే

  •  వీటికి తోడుగా ఎంఐఎం పార్టీ కలిసింది

  •  ఈ మూడు పార్టీలు ఒకేతాను మొక్కలు

  •  తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే కుటుంబ పార్టీలను ఓడించాలి

  •  పటాన్​ చెరు విజయ సంకల్ప సభలో బీజేపీ స్టేట్​ చీఫ్​ కామెంట్స్​


నా తెలంగాణ, పటాన్​ చెరు: ప్రధాని నరేంద్ర మోదీ విశ్వనాయకుడు అని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడారు. ‘‘తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ రహదారుల కోసం రూ. 1.20 లక్షల కోట్లు, ఎరువుల సబ్సిడీ కోసం రూ.33 వేల కోట్లు. రైల్వేల అభివృద్ధి కోసం రూ. 35 వేల కోట్లు, రేషన్ సబ్సిడీపై రూ.30 వేల కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ. 26,728 కోట్లు, రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం రూ. 10,998 కోట్లు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 10 వేల కోట్లు, సర్వశిక్షా అభియాన్ కింద రూ.7,500 కోట్లు, గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం రూ.7,200 కోట్లు, రామగుండంలో యూరియా పరిశ్రమ కోసం రూ. 6,338 కోట్లు, ఎల్పీజీ సబ్సిడీ కింద రూ. 5,859 కోట్లు, హెల్త్ మిషన్ కింద రూ. 5,550 కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం రూ. 4,500 కోట్లు, స్వచ్ఛ భారత్ కింద రూ. 3,745 కోట్లు, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఎయిమ్స్.. ఇలా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేసింది”అని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు.



తెలంగాణను దోచుకున్న బీఆర్​ఎస్​

కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపద దోచుకున్నారని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి విమర్శించారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియాతో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా.. ఏ రకమైన మార్పు కనపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన100 రోజుల్లోనే రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేయడం ప్రారంభించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్ ను బెదిరించి రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలే. వీటికి ఎంఐఎం పార్టీ కలిసింది. కుహనా లౌకికవాదం, ఓటుబ్యాంకు రాజకీయాలతో తెలంగాణ ప్రజలను దోచుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేసి, అధికారం పంచుకున్న పార్టీలే. ఈ మూడు పార్టీలు ఒకేతాను మొక్కలు. తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలి. కేసీఆర్.. తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని చూస్తుంది. కానీ బీజేపీ దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ. దేశంలో నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రధానిగా విజయం సాధించబోతున్నారు”అని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఫిర్​ ఏక్ బార్ మోదీ సర్కార్.. అప్ కీ బార్ చార్ సౌ పార్.. మోదీ మా కుటుంబ సభ్యుడే.. మేరా మోదీ.. మేరా పరివార్’ నినాదాలతో కిషన్​ రెడ్డి హోరెత్తించారు.