హింస సహించం.. సి–విజిల్​యాప్​ ప్రారంభిస్తాం

ఎన్నికల కమిషనర్​ రాజీవ్​ కుమార్​

Mar 5, 2024 - 14:12
Mar 5, 2024 - 16:55
 0
హింస సహించం.. సి–విజిల్​యాప్​ ప్రారంభిస్తాం

కోల్​కతా: ఎన్నికల సమయంలో హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని హింసను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సి విజిల్ పేరుతో ఒక అప్లికేషన్‌ను ప్రారంభిస్తుందని సామాన్య ప్రజానీకం కూడా ఈ యాప్​లో ఫిర్యాదు చేయవచ్చని  ప్రధాన ఎన్నికల కమిషనర్​ రాజీవ్​ కుమార్​ అన్నారు. రాజీవ్​ కుమార్ మంగళవారం​కోల్​కతాలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలన్నారు. భయాందోళనలు సృష్టించడం, బెదిరింపులకు పాల్పడడం వంటి వాటిపై కఠిన వైఖరిని అవలంభించనున్నట్లు స్పష్టం చేశారు. అవసరమైన మేరకు కేంద్ర బలగాలను మోహరిస్తామని కమిషనర్​ రాజీవ్​ కుమార్​తెలిపారు. సి–విజిల్​ యాప్​ ద్వారా అభ్యర్థి పాత రికార్డు గుర్తించవచ్చన్నారు. అతనిపై ఉన్న క్రిమినల్​ కేసులు కూడా యాప్​ లో ఉంటాయన్నారు. ఈ యాప్​ ద్వారా ఫిర్యాదు చేస్తే కేవలం 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటామన్నారు. 

వార్తాపత్రికల్లో నేరారోపణలు ప్రకటించాల్సిందే!


ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు తమపై ఉన్న నేరారోపణలకు సంబంధించిన వివరాలు మూడు వార్తాపత్రికల్లో ప్రకటించి ప్రచురించాలని రాజకీయ పార్టీలకు సూచించారు. రానున్న ఎన్నికల్లో కొన్ని పోలింగ్​ కేంద్రాలను కేవలం మహిళలు, దివ్యాంగులే నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అక్కడ మహిళా భద్రతా బలగాలు, సహాయకులు ఉంటారని తెలిపారు. సమాజంలో అందరికీ సమప్రాధాన్యత అనే నినాదాంతోనే ఎన్నికల కమిషన్​ ముందుకు వెళుతుందన్నారు.