కల్వర్టును ఢీ కొట్టిన కారు ఏడుగురు దుర్మరణం

మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు  సీఎం రేవంత్, ఎమ్మెల్యే హరీష్ రావు సంతాపం

Oct 16, 2024 - 20:58
 0
కల్వర్టును ఢీ కొట్టిన కారు ఏడుగురు దుర్మరణం

 నా తెలంగాణ, మెదక్: నర్సాపూర్ వెల్దుర్తి మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కల్వర్టును ఢీకొని వాగులో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందారు.  బుధవారంఈ విషాద ఘటన శివంపేట మండలం ఉసిరిక పల్లి శివారులో జరిగింది. శివంపేట మండలం, బీమ్లా తాండకు చెందిన నాన్ సింగ్ రాయనా భార్య శాంతి (38), కుమార్తె రమ్య (12), తాళ్లపల్లి తండాకు చెందిన శివరాం (65), దుర్గమ్మ (45), జగిత్యా తండాకు చెందిన అనిత (35), ఆమె కుమార్తెలు హిందూ (13), శ్రావణి (11)  కలిసి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సీతారాంపల్లి తండాలో జరిగిన బంధువుల విందుకు హాజరై స్వీఫ్ట్​ కారులో తిరిగి వస్తున్నారు. ఉసిరిక పల్లి శివారులో వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొని వాగులో పడింది.

ప్రమాదంలో డ్రైవర్ రామ్ సింగ్​ కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా శివరాం, దుర్గమ్మ, శాంత, అమ్ము, అనిత, హిందూ, శ్రావణిలు మృతి చెందారు. వాగులో నీటి ప్రవాహం ఉండడంతో ఊపిరాడక చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కారు డ్రైవర్ ఒక్కడే గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాగులో ఉన్న మృతదేహాలను ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు.