బుల్లెట్​ కంటే బ్యాలెట్​ ప్రధానం

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Nov 11, 2024 - 17:21
 0
బుల్లెట్​ కంటే బ్యాలెట్​ ప్రధానం

జితేందర్​ రెడ్డి గొప్ప జాతీయ భావజాలం ఉన్న వ్యక్తి
ధర్మం కోసం పోరాటంలో అసువులు బాసిన వీరుడు
జీవం పోసే శక్తి లేకుంటే.. ప్రాణం తీసే అధికారం ఎక్కడిది?
నక్సలైట్లు తుపాకులను విడనాడీ జన జీవన స్రవంతిలో కలవాలి
చిత్ర నిర్మాత, దర్శకుడు, కథానాయకులకు కేంద్రమంత్రి ప్రశంస

నా తెలంగాణ, హైదరాబాద్​: తుపాకీ బుల్లెట్​ కంటే ఓటు (బుల్లెట్​ కంటే బ్యాలెట్​) ప్రధానమని డాక్టర్​ బాబా సాహెబ్​ అంబేద్కర్​ ఎప్పుడో చెప్పారని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. సోమవారం ముదుగంటి రవీందర్​ రూపొందించిన చిత్రం జితేందర్​ రెడ్డి సినిమాను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దర్శకుడు విరంచి చిత్రాన్ని అద్భుతంగా మలిచారన్నారు. నిజ జీవిత ఆధారంగా తీసిన సినిమాలో వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపారని అన్నారు. జితేందర్​ రెడ్డి తండ్రి మల్లారెడ్డి వారి కుటుంబమంతా గొప్ప జాతీయ భావజాలంతో పనిచేశారని పేర్కొన్నారు. ఆయనకు ప్రాణహాని ఉందని తెలిసినా ఆయన నడచే బాటలో నిర్భయంగా నడిచారని, ఎవ్వరూ అడ్డుకోలేదన్నారు. ఆర్​ఎస్​ఎస్​ లో ఎన్నో రకాల బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ధర్మం కోసం పోరాడుతూ 72 బుల్లెట్ల దాడిలో మరణించిన గొప్ప పోరాట యోధుడు జితేందర్​ రెడ్డి అని అన్నారు. నక్సల్స్​ తో పోరాటంలో ఈయన మరణం ఎనలేని లోటన్నారు. 

ఈ సినిమాను నక్సలైట్లు కూడా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తికి జీవంపోసే శక్తి లేనప్పుడు ఆ వ్యక్తి ప్రాణాన్ని తీసే అధికారం, హక్కు ఎవ్వరికీ లేదని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. మారుతున్న వ్యవస్థలో హింసను, తుపాకులను విడనాడీ ప్రజలను అర్థం చేసుకొని జనజీవన స్రవంతిలో కలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జమ్మూకశ్మీర్​ లో ఉగ్రవాదాన్ని తగ్గించి 70 నుంచి 80 శాతం ఓటింగ్​ సాధించగలిగామన్నారు. అంబేద్కర్​ రాజ్యాంగానికి లోబడి పేదలు, బడుగు, బలహీన వర్గాలకు ప్రజలకు, రైతులకు సేవ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికైనా నక్సలైట్లు హింసను వదలిపెట్టి ప్రజాస్వామ్యంలోకి రావాలని ఆహ్వానించారు. 

అత్యద్భుతంగా సినిమాను నిర్మించిన నిర్మాతలు, దర్శకుడితోపాటు కథానాయకుడుగా నటించిన రాకేష్​ ను కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అభినందించారు.