చైనాకు ధీటుగా తయారీ రంగం పటిష్ఠం
ఫలితాలను సాధిస్తున్న భారత్.. విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్
నా తెలంగాణ, ఢిల్లీ: చైనాను ఎదుర్కొనేందుకు తయారీ రంగంపై దృష్టి సారించి దేశీయంగా భారత్‌ను సిద్ధం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం పదేళ్ల ముందే ప్రారంభించిందని ఫలితాలను కూడా సాధిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఆదివారం మీడియాతో మంత్రి జై శంకర్ మాట్లాడారు. చైనాతో కేవలం భారత్ కు సరిహద్దు సమస్య మాత్రమే లేదన్నారు. ప్రధాన ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. అయినా ప్రధాని మోదీ నేతృత్వంలో చైనా తీరును ఓ వైపు ఎండగడుతూనే మరోవైపు అన్ని రంగాల్లో పటిష్టం అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా భారత్‌లో తయారీ రంగం బలోపేతంతో భారత్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. మోదీ హయాంలో గత పదేళ్లలో ఆర్థికంగా ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చామని తద్వారా నేడు ప్రపంచదేశాల్లో భారత కీర్తి పతాకాలు రెపరెపలాడుతున్నాయన్నారు. నేడు ప్రపంచం మొత్తంలో అత్యంత ఎక్కువ చరిష్మా ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అదీ ప్రధాని నరేంద్ర మోదీయే అని జై శంకర్ తెలిపారు. సరిహద్దు వివాదాలతో చైనాతో సంబంధాలు క్షీణించినా, తరువాతి కాలంలో ఉద్రిక్తతలు తగ్గాయన్నారు. అయినా భారత్ తమ సరిహద్దులను రక్షించే అన్ని చర్యలను చేపడుతోందని జై శంకర్ పేర్కొన్నారు.