ఎస్సీ వర్గీకరణపై దేశవ్యాప్త ఆందోళనలు

Nationwide concerns over SC classification

Aug 21, 2024 - 14:45
 0
ఎస్సీ వర్గీకరణపై దేశవ్యాప్త ఆందోళనలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళన పలు చోట్ల ఉద్రిక్తతలు, పలు చోట్ల శాంతియుతంగా కొనసాగుతోంది. వర్గీకరణను నిరసిస్తూ పలు ప్రాంతాల్లోని మాల సామాజిక వర్గం నాయకులు బుధవారం భారత్​ బంద్​ కు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీల వర్గీకరపై సుప్రీం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బంద్​ కు పిలుపునిచ్చారు. రహదారులు, రైల్వేట్రాక్​ లపై ఆందోళనకారులు  బైఠాయించారు. 

రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి నాయకులు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై రాష్ట్రాలు ముందుకు వెళ్లకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లల్లో ఇప్పుడు ఉన్న కోటాను యథాతథంగా కొనసాగించాలన్నారు. ఇందులో ఎలాంటి మార్పులూ చేయకూడదని మాల సామాజిక వర్గానికి చెందిన శ్రేణులు పట్టుబట్టారు. అయితే, ఉత్తరాది రాష్ట్రాలపై భారత్ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నిరసనకారులు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. 

కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని అత్యున్నత న్యాయం స్పష్టం చేసింది. దీనిపై 2004లో ఐదుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తుత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.

ఈ బంద్‌కు భీమ్ సేన్ ఆర్మీ, జైభీమ్ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. దీంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.. దేశ రాజధాని ఢిల్లీలోనూ అంతంత మాత్రంగానే భారత్ బంద్ ప్రభావం కనిపిస్తుంది. ఇక, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు యధాతథంగా కొనసాగాయి.