అంత్యక్రియల కోసం యాచించిన చిన్నారి దుర్గ
తండ్రి మరణం - తల్లి ఆత్మహత్య .. ఇరువురి మరణంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో బాలిక గ్రామస్థుల సహకారంతో అంత్యక్రియలు పూర్తి బాలికను ఆదుకుంటాం: కలెక్టర్
నా తెలంగాణ, నిర్మల్: కొద్దిరోజుల క్రితమే తండ్రి మృతిచెందాడు. ఆ బాధ తట్టుకోలేక తల్లి కూడా శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. వారికి ఉన్న పదకొండేళ్ల కూతురు దుర్గ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అయినవారెవరూ తోడు లేకపోవడంతో చిన్నారి తల్లి శవాన్ని ఇంట్లో పెట్టుకొని అంత్యక్రియలు జరిపేందుకు స్థానికంగా యాచిస్తోంది. ఈ హృదయవిదారక ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. నిర్మల్ జిల్లా తానూరు మండలానికి చెందిన గంగమణి తనభర్తతో దూరంగా ఉంటూ కూలీ నాలీ చేసుకొని కూతురు దుర్గను ప్రభుత్వ పాఠశాలలో చదివించేది. కొద్ది రోజుల క్రితమే భర్త మృతిచెందాడు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు నా అనేవారెవ్వరూ తోడు లేకపోవడంతో తీవ్ర మానసిక్ష క్షోభ అనుభవించేది. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు చనిపోవడంతో దుర్గ అనాథలా మిగిలింది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఆదివారం ఉదయం ఇంటిముందు టవల్ పరుచుకొని తల్లి అంత్యక్రియలకు సహాయం చేయాలని విషన్న వదనాలతో యాచించడం పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు తలా ఓ చేయి వేసి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లికి చిన్నారి తలకొరివి పెట్టాల్సిన దుస్థితి నెలకొనడంతో ఈ దృశ్యాలను చూస్తున్న వారికి కన్నీరే మిగిలింది.
దుర్గను ఆదుకుంటాం: కలెక్టర్ అభిలాష అభినవ్..
ఈ ఉదంతం అధికారుల ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలికలో ఫోన్ లో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. బాలికను అన్ని విధాలుగా ఆదుకుంటామని, విద్యాబుద్ధులు నేర్పి మంచి భవిష్యత్ కు పునాది వేస్తామని భరోసా ఇచ్చారు.