ఛత్రపతి స్ఫూర్తిగా ముందుకు
బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి
నా తెలంగాణ, నిర్మల్: భారతదేశాన్ని మొఘల్ పాలకులు ఆక్రమిస్తున్న తరుణంలో హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన ఛత్రపతి శివాజీ ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉద్బోధించారు. శివాజీ పోరాటమే స్ఫూర్తిగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరటమే ధ్యేయంగా పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శివాజీ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా నిర్మల్ లోని శివాజీ చౌక్ లో శివాజీ విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మొఘల్ ఆక్రమణదారులు భారతదేశంలో ప్రవేశించి దేశాన్ని చిన్నాభిన్నం చేశారని అన్నారు. అలాంటి తరుణంలో హిందూ సామ్రాజ్య స్థాపన ధ్యేయంగా కృషిచేసిన ఛత్రపతి శివాజీ నేటి యువతకు ఆదర్శం కావాలని సూచించారు. శివాజీ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా స్వీకరించి ముందుకు సాగుతామని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, ఆ దిశగా కృషి చేస్తామని అన్నారు.
పోలీసులపై విమర్శనాస్త్రాలు..
ఈ సందర్భంగా నిర్మల్ పోలీసులపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం 307 సెక్షన్ ను ఇష్టారాజ్యంగా వాడుతున్నారని ఆరోపించారు. ఈ విధానం మంచిది కాదని, దీన్ని సరిదిద్దుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భూమయ్య, రావుల రామనాథ్, మెడిసిమ్మే రాజు, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.