బీజేపీలోకి చంపై సోరెన్?
ఢిల్లీకీ పయనం ఆరుగురు ఎమ్మెల్యేలతో పార్టీలో చేరే యోచన! సీఎం పదవీచ్యుతుడు కావడం, హేమంత్ సోరెన్ విధానాలతో మనస్థాపం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ లకు గడ్డుకాలమే
రాంచీ: ఝార్ఖండ్ జేఎంఎం పార్టీలో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. ఆ పార్టీ మాజీ సీఎం, సీనియర్ నేత చంపై సోరెన్ ఆరుమంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరనున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. శనివారం కోల్ కతాలో ఉన్న చంపై సోరెన్ ఆదివారం ఉదయం ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీలో చేరడంపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సువేందు అధికారితో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది.
హేమంత్ సోరెన్ బెయిల్ నుంచి వచ్చాక సీఎం పదవికి చంపై రాజీనామా చేయడంపై ఆయన తరఫు ఎమ్మెల్యే తీవ్ర మనస్థాపం చెందారు. దీంతో ఆయన సీనియారిటీకి కూడా మర్యాద ఇవ్వకుండా పదవి నుంచి తప్పించడంపై హేమంత్ సోరెన్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంపై కూడా గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలలో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.
దీంతో ఆయన ఇక పార్టీ వీడడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా ఝార్ఖండ్ అసెంబ్లీ కాలం జనవరితో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా ఈసీ వెల్లడించలేదు.
ఆరుగురు ఎమ్మెల్యేలలో దశరథ్ గగ్రాయ్, రాందాస్ సోరెన్, చమ్రా లిండా, లోబిన్ హెంబ్రోమ్, సమీర్ మొహంతిలు బీజేపీలో చంపైతోపాటు చేరే వారి లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఝార్ఖండ్ బీజేపీ ఎన్నికల ఇన్ చార్జీగా అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఉన్నారు. ఈయనతో కలిసి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
ఏది ఏమైనా అదే జరిగితే జేఎంఎంకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఝార్ఖండ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ తో కలిసి జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ భవిష్యత్ లో చంపై సోరెన్ పార్టీని వీడడం ఈ రెండు పార్టీలకూ పెద్ద దెబ్బే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఝార్ఖండ్ లో మొత్తం 82 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గతంలో జేఎంఎంకు 26 మంది, కాంగ్రెస్‌కు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో పాటు బీజేపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, ఏజేఎస్‌యూకు చెందిన 3, సీపీఎం-ఎల్ 1, ఎన్సీపీ 1, ఆర్జేడీ 1, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.