మెడికో విద్యార్థి హత్య.. నిందితుడికి సీఎఫ్ ఎస్ ఎల్ పరీక్షలు
పూర్తి నిజాల వెల్లడికి సీబీఐ విశ్వ ప్రయత్నం సీబీఐకి సీఎం మమత హెచ్చరికలు!
కోల్ కతా: మెడికో హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు ఆదివారం సీబీఐ మానసిక పరీక్షలు నిర్వహిస్తోంది. ఐదుగురు నిపుణుల బృందం అతన్ని ఉదయం సీఎఫ్ ఎస్ ఎల్ విభాగానికి తీసుకువెళ్లింది. ఈ బృందాన్ని కేంద్రం నుంచి సీబీఐ ఉన్నతాధికారులకు కోల్ కతాకు ఒకరోజు ముందే పంపించారు. ఈ పరీక్షల ద్వారా నిందితుడి పూర్తి మానసిక స్థితి తెలుస్తుంది. ఇప్పటికే సీబీఐ రెండురోజులపాటు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను విచారించింది. కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.
సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకొని ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. ఇతను పోలీసు వాలంటీర్ గా సేవలందిస్తూ పలువురు పోలీసు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. దీంతో పోలీసుల దర్యాప్తు తీరుపై కూడా పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్టులో బాధితురాలిని లైంగికంగా తీవ్రంగా హింసించి హత్య చేసినట్లుగా సీబీఐ గుర్తించింది. ఆమె శరీరమంతా గాయాలున్నట్లు తెలిపింది. పోస్టుమార్టం నివేదికలోని ప్రతీ ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను ఆ దిశగా ప్రశ్నలు వేస్తూ సమాచారాన్ని రాబట్టేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది.
మరోవైపు సీబీఐ విచారణలో సీఎం మమతా బెనర్జీ మండిపాటుకు గురవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆదివారం రాత్రి వరకు సీబీఐ విచారణ పూర్తి కాకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించడం గమనార్హం. కాగా సీఎం మమత తీరు చూస్తుంటే అత్యాచారం, హత్య వెనుక ఎవరో తమ పార్టీ పెద్దల హస్తమే ఉన్నట్లుగా కనిపిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.