- రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల డైవర్షన్ రాజకీయాలు
- బీజేపీ అనుకూల వాతావరణం చెడగొట్టే వ్యూహం
- మోదీ మేనియా తగ్గించి.. తాము ఓట్లు పొందాలని ఆరాటం
- సీఎం రేవంత్, హరీశ్ రావు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు
- నువ్వు కొట్టినట్టు చెయ్.. నేను ఏడ్చినట్టు చేస్త తీరుగా వ్యవహారం
నా తెలంగాణ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తున్నది. మోదీ మేనియా తగ్గించడం, బీజేపీ అనుకూల వాతావరణం చెడగొట్టడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజల దృష్టి మళ్లించే పాలిటిక్స్ మొదలు పెట్టాయి. ఇందులో భాగంగానే రాజీనామా సవాళ్లు, ప్రతి సవాళ్లు చేస్తూ.. ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేస్తున్నారు ఇరు పార్టీల నాయకులు.
ఋణమాఫీ ప్రకటనతో..
మామూలుగా చెబితే జనం నమ్మే పరిస్థితిలో లేరని భావించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి.. ఏ జిల్లాలో పర్యటించినా.. ఆ జిల్లాలో ప్రముఖ దేవుడిపై ఒట్టు వేస్తూ.. ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల వరకు రైతు ఋణమాఫీ ఏకకాలంలో పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇలా ఇప్పటి వరకు పదుల సంఖ్యలో దేవుళ్లపై ప్రమాణాలు చేశారు. ముఖ్యమంత్రి మాటలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇస్తూ.. ఆగస్టు లోపు రూ.2 లక్షల ఋణమాఫీ చేస్తే.. తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీనిపై మళ్లి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాజీనామా పత్రాన్ని హరీశ్ రావు తన జేబులో పెట్టుకోని సిద్ధంగా ఉండాలని కౌంటర్ ఇచ్చారు. అయితే నిన్నటి వరకు ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీశ్ రావు.. మాట మారుస్తూ.. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు ఆగస్టు 15 లోపు అమలు చేస్తే.. తప్పకుండా రాజీనామా చేస్తానని సవాల్ పరిధిని విస్తరించారు.
గన్ పార్క్ వద్ద హరీశ్ సవాల్..
హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని హరీశ్‌రావు విమర్శించారు. తన రాజీనామా పత్రాన్ని శుక్రవారం గన్‌పార్క్‌లోని అమర వీరుల స్తూపం వద్ద జర్నలిస్టులకు ఇచ్చారు. ‘‘నా ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరగడమే ముఖ్యం. ఆగస్టు 15 లోపు ఋణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలి. ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పడం బోగస్. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి గన్‌పార్కు వద్దకు వచ్చాను. ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన ఇక్కడికి రావాలి. మేధావుల చేతిలో నా రాజీనామా పత్రాన్ని పెడుతున్నా. ఆగస్టు15 లోపు కాంగ్రెస్ ఏకకాలంలో రూ.2 లక్షల ఋణమాఫీ, ఆరుగ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు ఇవ్వండి. ఉప ఎన్నికలో కూడా పోటీ చేయను. ఒకవేళ వీటిని అమలు చేయలేకపోతే తన రాజీనామాను గవర్నర్‌కు ఇవ్వడానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా?’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి కౌంటర్
హైదరాబాద్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘హరీశ్‌రావు మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు స్తూపం గుర్తొస్తుంది. హరీశ్ సవాల్‌ను స్వీకరించా.. ఆగస్టు15లోపు ఋణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్దిపేటకు ఆయన శని వదిలిపోతుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారా? రైతు ఋణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15లోపు ఋణమాఫీ చేస్తా. హరీశ్‌రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. ఋణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు? దానికి రూ.30- నుంచి 40వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరంలో మీరు దోచుకున్న రూ.లక్ష కోట్ల కంటే అది ఎక్కువా? హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్న వేల ఎకరాల కంటే ఎక్కువా?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ చర్చ ఉండొద్దని కుట్ర?
తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండూ బీజేపీతోనే తలపడుతున్నాయి. పార్టీ జాతీయ నేతల పర్యటనలతో కమలం పార్టీలో జోష్ కనిపిస్తున్నది. దాదాపు 12కు పైగా సీట్లు వచ్చే అవకాశముందని అటు ప్రభుత్వ నిఘా వర్గాలతోపాటు ప్రైవేటు సర్వే సంస్థలూ చెబుతున్నాయి. ఇలా రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉండటం, మోదీ మేనియాతో మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటూ.. బీజేపీని జనం దృష్టి నుంచి తెరమరుగు చేసే విఫలయత్నం కనిపిస్తున్నది. కావాలనే ఋణమాఫీ–రాజీనామాల ఎపిసోడ్ ను రెండు పార్టీలు వారం పాటు నడిపించాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.