అమెరికా–చైనా బంధాలపై నీలినీడలు

ఇరుదేశాల ఉన్నతాధికారులు భేటీ అధ్యక్షుడు జిన్​ పింగ్​ తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​ చర్చలు ఎడమొఖం, పెడమొఖమే ప్రపంచభద్రతకు ముప్పుపై ఇరుదేశాల విచారం

Apr 26, 2024 - 16:56
 0
అమెరికా–చైనా బంధాలపై నీలినీడలు

న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదు. శుక్రవారం బీజింగ్​ లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​ తో అధ్యక్షుడు జిన్​ పింగ్​, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ఉన్న అపోహల వల్ల కలిగే ప్రమాదాలపై చర్చించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ప్రజా భద్రత మంత్రి వాంగ్ జియావోంగ్ తో చర్చల అనంతరం బ్లింకెన్ అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ఎడమొఖం, పెడమొఖమే ఉన్నా ఈ మధ్య చర్చలు పెరిగాయి. చర్చల కోసం ఉన్న అన్ని మార్గాలపై బ్లింకెన్​, వాంగ్​ లు ప్రాముఖ్యత నిచ్చారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని ఇరువురు విచారం వ్యక్తం చేశారు. 

విబేధాలకు కారణాలు..

కరోనా పరిణామాల అనంతరం అమెరికా, చైనా మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయనే చెప్పాలి. అమెరికా ఇంటలిజెన్స్​ కరోనా వైరస్​ చైనా నుంచే వచ్చిందని పలుమార్లు రూఢీ చేసినా చైనా తమకేం తెలియదని, అసలు ఆ వైరస్​ అమెరికా నుంచే వచ్చిందని వితండ వాదనకు దిగింది. ఈ విషయంపై ఐక్యరాజ్య సమితి విచారణ సందర్భంగా కూడా చైనా పలు ఆటంకాలు కల్పించింది. ఇదే అమెరికా ఆగ్రహానికి కారణమైంది. అనంతర పరిణామాల్లో కూడా చైనాతో విబేధాలు తలెత్తాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ విదేశీ సహాయ బిల్లుపై సంతకం చేసినప్పుడు రెండు దేశాల మధ్య విబేధాలు తారస్థాయికి చేరి బహిర్గతం అయ్యాయి. అమెరికా ఆగ్రహానికి  కారణాలు లేకపోలేదు. తరచూ చైనా తన చుట్టూ ఉన్న దేశాల సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించడం, చైనా చుట్టుపక్కల ఉన్న సముద్రతీరాలన్నీ తమవేగా చెప్పుకోవడం, ఇతర దేశాల సముద్ర మార్గాల్లో యుద్ధ నౌకలను మోహరించే ప్రయత్నం చేయడం, ఇతర దేశాల సరిహద్దు ప్రాంతాలను తమవిగా చెప్పుకునే అసత్య సాక్ష్యాలను సృష్టించడం లాంటివి కారణమయ్యాయి.

అయితే చైనా చర్యలపై ఇటు భారత్​, తైవాన్​, జపాన్​ తదితర దేశాలన్నీ ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తూనే మరోవైపు అమెరికాతో కూడా ఈ విషయాలపై కూలంకషంగా చర్చించడంతో చైనా చర్యలు బుట్టదాఖలయ్యాయి. మరోవైపు మానవ హక్కుల ఉల్లంఘన, రష్యాకు ఆయుధాల అందజేత, సింథటిక్​ ఓపియాయిడ్​ అనే రసాయన ఉత్పత్తి,ఎగుమతులు కూడా చైనాపై అమెరికా ఆగ్రహానికి కారణాలుగా మిగిలాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఇప్పుడప్పుడే ఉద్రిక్తతలు తగ్గే అవకాశం లేదని విదేశాంగ ప్రతినిధులు భావిస్తున్నారు.