ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయం
ఐక్యరాజ్యసమితిలో అజాతశత్రుసింగ్ యూఎన్ ప్రసంగంలో రాజా హరిసింగ్ మనవడి కీలకవ్యాఖ్యలు
నా తెలంగాణ, ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు ఒక చారిత్రాత్మక నిర్ణయమని రాజా హరిసింగ్ (అప్పటి జమ్మూకశ్మీర్రాజు) మనవడు, బీజేపీ నాయకుడు అజాతశత్రుసింగ్ పేర్కొన్నారు. శనివారం ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ నిర్ణయం సాహసోపేతమైందని, జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఈ నిర్ణయం కీలకమని భావిస్తున్నట్లు తెలిపారు. 370 రద్దుతో ఎవ్వరూ ఊహించని విధంగా మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి ద్వారాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, భారీ ప్రాజెక్టులతో బాటు పర్యటక రంగం అభివృద్ధిని కళ్లారా చూస్తున్నామన్నారు. పర్యటకుల భద్రతకు పూర్తి భరోసా కల్పిస్తేనే ఏదైనా రాష్ట్రం అభివృద్ధికి ద్వారాలు తెరుచుకుంటాయని అజాతశత్రు స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ఉగ్రవాద ఘటనలు పూర్తిగా తగ్గాయన్నారు. 2004 నుంచి 2014 మధ్య 7217 ఉగ్ర వాద ఘటనలు జరగ్గా, 2014 తరువాత అవి పూర్తిగా తగ్గుముఖం పట్టాయన్నారు. ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రజల మెరుగైన జీవన విధానం కోసం భద్రతా మండలి తీర్మానాలు అవసరమని ఆయన ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు.