శాంతిభద్రతల అదుపులో సీఎం విఫలం
కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థుల ఘర్షణలపై ప్రభుత్వం మౌనం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై
చెన్నై: తమిళనాడులో రోజురోజుకు శాంతిభద్రతల పరిస్థితిని అదుపులో పెట్టడంలో సీఎం స్టాలిన్ విఫలమయ్యారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె. అన్నామలై ఆరోపించారు. ఇటీవల తమిళనాడులో హత్యలు, దాడులు, విద్యార్థుల ఘర్షణలపై మంగళవారం మీడియాతో మాట్లాడారు. వల్లయ్యూర్ లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ లో విద్యార్థులు కులాల పేరుతో ఘర్షణ పడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్దుర నటించడంపై మండిపడ్డారు. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విద్యాసంస్థ గోడలపై ఇష్టారీతిన రాతలు రాస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తోందన్నారు. తిరునెల్వేలి, విజయ నారాయణలోని కేంద్రీయ విద్యాలయంలో ఓ విద్యార్థి సహ విద్యార్థిపై కొడవలితో దాడి చేశాడన్నారు. సీఎం స్టాలిన్ ప్రభుత్వంలో పాఠశాలకు విద్యార్థులు మారణాయుధాలు తెస్తున్నారంటే అది ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్యాన్ని సూచిస్తుందన్నారు. విద్యార్థుల భద్రతపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుచిరాపల్లిలో 17ఏళ్ల విద్యార్థిని కొందరు దుండగులు దాడిచేసి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా ఘటనలపై సీఎం స్టాలిన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నామలై మండిపడ్డారు.