జమ్మూకశ్మీర్ సభలో ప్రధాని మోదీ
ఉగ్రదాడులు.. తెల్లజెండాలా?
బుజ్జగింపునకు కేరాఫ్ కాంగ్రెస్
కన్నెత్తి చూస్తే కళ్లు పీకేస్తాం
శ్రీనగర్: ఓ వైపు ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే.. మరోవైపేమో కాంగ్రెస్ తెల్లజెండాలు చూపేదని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితిలో పూర్తిగా మార్పు తీసుకువచ్చామన్నారు. వారి ఇంట్లోకి వెళ్లి మరీ కొట్టివస్తున్నామన్నారు. బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ కేరాఫ్ అన్నారు. సువిశాల భారత్ దృక్పథాలు, ఆశయాలు, ఆలోచనా రీతిని పూర్తిగా మార్చివేసి మంటగలిపేలా ప్రయత్నించారని మండిపడ్డారు. కానీ మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక భారత శక్తిని ప్రపంచదేశాలకు చాటి చెబుతున్నామన్నారు. జమ్మూకశ్మీర్ లో భారతీయ జెండా ఎగురవేయలేని వారు ఈ రోజు అధికారం చేజిక్కించుకొని రాష్ర్టాన్ని భ్రష్టుపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ విరుచుకుపడ్డారు. బుల్లెట్ కు గుళ్లతోనే సమాధానం ఇస్తామన్నారు. నయా భారత్ పేరుచెబితేనే ఉగ్రవాదులకు తడిచిపోవాలన్నారు. కన్నెత్తి చూస్తే గుడ్లు పీకీ గోళీలు ఆడుకుంటామన్నారు.
విజయదశమితో శుభారంభం..
మూడోవిడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జమ్మూలోని ఎంఏస్టేడియంలో జరిగిన విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రసంగించారు. జమ్మూకశ్మీర్ లో సంపూర్ణ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. నూతన అధ్యాయాన్ని లిఖించబోతున్నామని మోదీ తెలిపారు. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు రానున్నాయని తెలిపారు. అక్టోబర్ 12న విజయ దశమి మనందరికీ శుభారంభం అవుతుందని తెలిపారు.
శాంతి, అభివృద్ధి దిశగా జమ్మూకశ్మీర్..
ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాళ్లదాడులు వంటివి పూర్తిగా నియంత్రించబడ్డాయన్నారు. ప్రజలంతా అభివృద్ధి, విద్య, వైద్యం, పర్యాటకం లాంటి రంగాలలో ఉపాధి పొందుతూ దేశ భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములు కావడం సంతోషకరమన్నారు. జమ్మూకశ్మీర్ లో ఇదే తన చివరి సభ అన్నారు. ప్రజల్లో ఉత్సాహం నెలకొందన్నారు. రాష్ర్ట ప్రజలు విభజనను ఎప్పుడూ కోరుకోలేదన్నారు. అవినీతి, వేర్పాటువాదం, కుటుంబతత్వ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకున్నాయని మండిపడ్డారు. ఈ ప్రాంతాన్ని మూడు కుటుంబాలే పాలిస్తూ భ్రష్టు పట్టించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ప్రజలు అవినీతి, వివక్ష రాజకీయ వ్యవస్థను కోరుకోవడం లేదన్నారు. శాంతి, అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు.
బంగారు భవిష్యత్ ను దరి చేరుస్తాం..
వీరి హయాంలో దశాబ్దాలుగా రాష్ర్టాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. దీంతో రాష్ర్టం తీవ్ర వివక్షకు గురైందన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ర్ట ప్రజలకు బంగారు భవిష్యత్ ను దరిచేర్చి తీరుతుందని మోదీ హామీ ఇచ్చారు. తుచ్ఛ పార్టీలను తిప్పికొట్టాలని ప్రజలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ రాష్ర్టానికి మేలు చేసే బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ గౌరవించలేదన్నారు. సైనికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్న బీజేపీ అనేక చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు.