నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఈవీఎంల ఫిర్యాదులు, ఆరోపణలపై కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ స్పందించారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమన్నారు. మంగళవారం న్యూఢిల్లీలోని ఈసీ కార్యాలయంలో 16 రాష్ర్టాల్లోని 417 స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఈ సమావేశంలో ఆరోపణలపై స్పందించారు. ప్రతిపక్షాల నుంచి వచ్చిన ప్రతిఫిర్యాదుపై లిఖిత పూర్వక సమాధానం ఇస్తామన్నారు.
ఈవీఎంల హ్యాకింగ్ కు ఆస్కారమే లేదన్నారు. ఈవీఎంలలో ఆయా పార్టీల గుర్తులు ఏర్పాటు చేసినప్పటి నుంచి పూర్తి వీడియో మాధ్యమంగా సమాచారం తమ వద్ద నిక్షిప్తమై ఉంటుందన్నారు. ఈవీఎంలలోని బ్యాటరీలు వాటితో కనెక్ట్ అయి ఉండవన్నారు. ఈవీఎంలను నిర్వహిస్తున్న ప్రత్యేకాధికారుల వివరాలన్నీ ఉంటాయని తెలిపారు. ఈసీ చెప్పినప్పుడు మాత్రమే బ్యాటరీలను ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తారని తెలిపారు. ఈవీఎంల పర్యవేక్షణకు మూడంచెల భద్రత ఉంటుందన్నారు.
పేజర్ ను హ్యాక్ చేసినట్లు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే ఆరోపణలపై కూడా రాజీవ్ కుమార్ స్పందించారు. పేజర్ కు బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుందన్నారు. ఈవీఎంకు కనెక్ట్ కాదన్నారు. ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అనేక రకాలుగా తనిఖీ చేస్తామన్నారు. ట్యాంపరింగ్ కు అవకాశం లేదన్నారు.
ఎన్నికలకు 56 రోజులు ముందు ఈవీఎంలను సిద్ధం చేస్తామన్నారు. ఆ సమయంలో అందులో బ్యాటరీలను అమర్చి వాటిపై ప్రత్యేక కోడ్ లను ఏర్పాటు చేస్తారన్నారు. వీటి నిర్వహణలో పాల్గొన్న ప్రతీ ఒక్కరి వివరాలు ఉంటాయని తెలిపారు. ఈవీఎంలు మొబైల్, పేజర్, కాలిక్యూలేటర్లు కాదని గుర్తించాలన్నారు. ఏ మిషన్ ఎక్కడికి వెళుతుందో దాని రికార్డులు సమర్థంగా నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు. అపోహలు, ఆరోపణలకు తావులేదన్నారు.