నామమాత్రంగానే ఆర్​వోఆర్​ చట్టంపై చర్చ

రైతులను ఆహ్వానించని అధికారులు  సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం  ఎవరి అభిప్రాయాల వెల్లడికో? 

Aug 25, 2024 - 15:50
 0
నామమాత్రంగానే ఆర్​వోఆర్​ చట్టంపై చర్చ

నా తెలంగాణ, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేసేందుకు రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం (ఆర్​వోఆర్) చట్టం 2024 ముసాయిదాపై ప్రజాభిప్రాయాలు సేకరించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ధరణి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఆర్​వోఆర్ 2024 చట్టం తీసుకువస్తున్నదని దీంట్లో ప్రజాభిప్రాయాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. 

కానీ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చర్చ కార్యక్రమం రైతులు, మేధావులు లేక నామమాత్రంగా ముగిసిందని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రైతులను ఎవరిని ఆహ్వానించకుండా సమాచారం ఇవ్వకుండా కేవలం పదిమందితోనే చర్చా వేదిక నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ చర్చా వేదికకు రైతులే కాదు మండల స్థాయి రెవెన్యూ అధికారులు కూడా గైర్హాజరవడం విశేషం. 

జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో రెండున్నర లక్షల మంది రైతులు ఉండగా ఈ చర్చా వేదికలో పట్టుమని పదిమంది కూడా లేకపోవడంతో రైతు సంఘాల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ధరణి సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, అప్పిలేట్ అథారిటి అధికారం కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందేలా నూతన చట్టం రూపొందించాలని రైతులు డిమాండ్​ చేశారు. చర్చా వేదికలో నిర్వహించిన అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. 

చర్చా వేదికను మరోమారు నిర్వహించి జిల్లాలోని  రెవెన్యూ అధికారులు, రైతులందరినీ ఆహ్వానించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. 

కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూతన ఆర్​వోఆర్ చట్టంపై నిర్వహించిన ప్రజా అభిప్రాయ చర్చా వేదికను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించాలి. రెవెన్యూ అధికారులు, రైతులందరినీ ఆహ్వానించి అందరి సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడితేనే సత్ఫలితాలను సాధించే అవకాశం ఉంది. లేకుంటే ఈ చర్చా వేదికలోని నిర్ణయాలపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.

రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బైరాజ్​..