భారత్ లో డిజిటల్ విప్లవం ప్రశంసించిన బిల్ గేట్స్
ఒకరు టెక్ దిగ్గజం..ఇంకొకరు పొలిటికల్ అద్భుతం. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రపంచంలోని అన్ని అంశాలనూ సృజించింది.
న్యూఢిల్లీ: ఒకరు టెక్ దిగ్గజం..ఇంకొకరు పొలిటికల్ అద్భుతం. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రపంచంలోని అన్ని అంశాలనూ సృజించింది. ప్రధాని నరేంద్రమోదీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మధ్య చాయ్ పే చర్చ ఆసక్తికరంగా సాగింది. డిజిటల్ రంగంలో భారత్ వేగంగా సాధిస్తున్న విప్లవాత్మక మార్పులపై టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్‌లో గత పదేళ్లలో డిజిటల్, సాంకేతిక విప్లవం ఊహించని స్థాయిలో ముందుకు సాగిందని బిల్ గేట్స్ అన్నారు. ఏ దేశమూ ఊహించని రీతిలో ఇక్కడ డిజిటల్ చెల్లింపులు జరగడం ఆశ్చర్యకరమన్నారు. రానున్న కాలంలో భారత్ అత్యధిక డిజిటల్ కార్యకలాపాల దేశంగా ప్రథమ స్థానంలో నిలుస్తుందని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ మధ్య చాయ్ పే చర్చ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన ఫొటోలు, వీడియోలను శుక్రవారం గేట్స్ షేర్ చేసుకున్నారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాయి. ఈ భేటీలో ప్రధాన అంశం సాంకేతికత కాగా దీంతో పాటు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర అంశాలు కూడా ఈ చర్చలో ప్రధానంగా ఉన్నాయి. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బిల్ గేట్స్ ఇటీవల భారత పర్యటనకు వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డిజిటల్ రెవల్యూషన్ వరకు అనేక అంశాలపై చర్చించారు. భారతదేశానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా ప్రధాని మోదీ బిల్ గేట్స్‌తో పంచుకున్నారు. 45 నిమిషాల వీడియోలో ఇద్దరూ భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, టీకా, సాంకేతికత, మహిళా శక్తి, వాతావరణ మార్పుల గురించి మాట్లాడారు. 2023 జీ–20 సమ్మిట్ సందర్భంగా ఏఐని ఎలా ఉపయోగించారో ప్రధాని మోదీ చెప్పారు. కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో ఏఐ తన హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి ఎలా అనువదించిందనే విషయాలను ప్రధాని ప్రస్తావించారు.