ఉగ్రవాదం నుంచి అభివృద్ధి దిశగా  

– జమ్మూకశ్మీర్​లో మారిన పరిస్థితులు – అసాంఘిక శక్తుల పీచమణిచిన మోదీ ప్రభుత్వం – భారీ పెట్టుబడులతో స్థానికులకు ఉపాధి – ఆలోచన రీతిలో మార్పుతో మారిన పరిస్థితులు

Mar 29, 2024 - 17:37
 0
ఉగ్రవాదం నుంచి అభివృద్ధి దిశగా  

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్
 జమ్మూకశ్మీర్​ అంటేనే ఒకప్పుడు ఉగ్రవాదానికి పెట్టింది పేరుగా ఉండేది. కానీ 2014 తరువాత క్రమేణా పరిస్థితుల్లో పూర్తిగా మార్పు చోటు చేసుకుంది. బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదంపై విరుచుకుపడుతూ.. అదే సమయంలో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తోంది. క్రమేణా ఆ రాష్ర్ట యువత, ప్రజల మనసుల్లో దేశద్రోహ బీజాలను పారదోలి దేశభక్తి, అభివృద్ధి, బతుకు దెరువు అనే బీజాలు నాటడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమైందనే చెప్పాలి. ఇదంతా కేవలం పదేళ్లలో జరిగింది. రాళ్లదాడులు, తుపాకుల మోతలు, బాంబు  పేలుళ్ల నుంచి ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విముక్తి కల్పించింది.

1800 రోజుల్లో జమ్మూకశ్మీర్​లో పూర్తిగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. మార్పు నేపథ్యంలో సాయుధ దళాల చట్టాన్ని పక్కన పెట్టే సమయం ఆసన్నమైందని అదే సమయంలో ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక జమ్మూ నుంచి సైన్యాన్ని పూర్తిగా తొలగించేందుకు సంసిద్ధతను ప్రకటించింది. ఆర్టికల్​ 370 రద్దుతో పూర్తిగా ఇక్కడి పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చినట్లయింది. అదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల వద్ద రక్షణ రేఖలను ఏర్పాటు చేసుకోవడం, నిఘా పటిష్టం చేయడం, సాంకేతికతతో ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడం, అంతర్జాతీయ సమాజంలో శత్రుదేశం చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం, సాక్ష్యాలతో సహా అందజేయడంతో ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుగా పాక్​ పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయంగా కేవలం చైనా తప్ప పాక్​కు ఏ దేశమూ ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. 

ఉగ్ర ఘటనలు..


2010లో 70 కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2023లో కేవలం రెండు ఘటనలు మాత్రమే చోటు చేసుకోవడం గమనార్హం. 2010లో జమ్మూ కశ్మీర్‌లో 489 చొరబాటు ఘటనలు చోటు చేసుకోగా, 2023లో 48 ఘటనలు మాత్రమే జరిగాయి. ఆర్టికల్ 370 వల్ల తలెత్తిన వేర్పాటువాద భావన ఉగ్రవాదానికి మూలం. ఆర్టికల్ 370 రద్దుతో వేర్పాటువాదం భారీగా తగ్గుముఖం పట్టింది. 1994 నుంచి 2004 మధ్య జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 40,164 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. 2004, 2014 మధ్య ఈ సంఘటనలు 7,217 జరిగాయి, అయితే మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో ఈ సంఘటనలు 70 శాతం తగ్గి 2,197 మాత్రమే. వీటిలో 65 శాతం పోలీసుల చర్య వల్లనే సంభవించాయి. మోదీ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు పౌరుల మరణాల సంఖ్య 72 శాతం తగ్గగా, భద్రతా బలగాల మరణాల సంఖ్య 59 శాతం తగ్గింది. 2010లో జమ్మూ కాశ్మీర్‌లో 2,654 రాళ్లదాడి ఘటనలు జరగ్గా, 2023లో ఒక్క రాళ్లదాడి ఘటన కూడా జరగలేదు. 2010లో 132 వ్యవస్థీకృత సమ్మెలు జరగగా, 2023లో ఒక్కటి కూడా జరగలేదు. 2010లో రాళ్లదాడిలో 112 మంది పౌరులు మరణించగా, 2023లో ఒక్కరు కూడా చనిపోలేదు. 2010లో రాళ్లదాడిలో 6,235 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు, 2023లో ఒక్కరు కూడా గాయపడలేదు. గతంలో జరిగిన ఉగ్ర ఘటనల వల్ల సొంత దేశంలోనే 1,57,967 మంది నిరాశ్రయులయ్యారు.

మార్పు..

30యేళ్ల తర్వాత తొలిసారిగా కశ్మీర్​ లోయలో మల్టీప్లెక్స్​ సినిమా థియేటర్ ​ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ థియేటర్లో వందకు పైగా సినిమాలు ఆడాయి. ఐదేళ్లలో ఇక్కడి జీఎస్​డీపీ లక్ష కోట్ల నుంచి రూ. 2,27,927 కోట్లకు పెరగడం విశేషం. గతంలో 94 డిగ్రీ కాలేజీలు ఉండగా ప్రస్తుతం 147 ఉన్నాయి. ఐఐటీ, ఐఐఎం, రెండు ఎయిమ్స్ వంటి నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవే గాక 4 మెడికల్ కాలేజీలు ఉండగా, ఇప్పుడు కొత్తగా ఏడు మెడికల్ కాలేజీలు, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు,  గతంలో మెడికల్ సీట్లు 500 ఉండగా, 800 సీట్లు అదనంగా, పీజీ సీట్లు 367 ఉండగా, ఇప్పుడు కొత్తగా 397 సీట్లను చేర్చారు. 

భారీ ప్రాజెక్టులు..

రూ. 58 వేల 477 కోట్ల విలువైన 32 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. రూ.58 వేల కోట్లలో రూ.45 వేల 800 కోట్ల వ్యయం పూర్తయింది. 5000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి  లక్ష్యంతో రూ.4,987 కోట్లతో 642 మెగావాట్ల కిరు హైడ్రో ప్రాజెక్ట్, రూ. 5000 కోట్లతో 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ప్రాజెక్ట్, రూ. 5200 కోట్లతో 850 మెగావాట్ల రాటిల్ హైవే ప్రాజెక్ట్, 1000 మెగావాట్ల వ్యయంతో రూ. 8112 కోట్లు.. గత 10 ఏళ్లలో 1 మెగావాట్ల సోపక్ దాల్ హైడ్రో ప్రాజెక్ట్, 1856 మెగావాట్ల సావల్‌కోట్ హైడ్రో ప్రాజెక్ట్ రూ. 2300 కోట్లు, షాపూర్ ఖండి డ్యామ్ ఇరిగేషన్ అండ్ పవర్ ప్రాజెక్ట్ రూ. 2793 కోట్లతో జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారు. మొదటి సారి, 1600 మెగావాట్ల సౌరశక్తిని పొందేందుకు ఒక ప్రాజెక్ట్ కు కూడా కేంద్రం ఆమోదముద్ర వేసింది. 467 కిలోమీటర్ల కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, 266 అప్ స్టేషన్లు నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం 11000 సర్క్యూట్ కిలోమీటర్ల ఎస్టీ, ఐటీ లైన్లను ఆదా చేసింది. 

రవాణా వేగవంతం.. మౌలిక సదుపాయాలు..

జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన 59 రోజుల తర్వాత నీటిపారుదల కోసం డీసిల్టింగ్ పనులు పూర్తయ్యాయి. రైలు నెట్‌వర్క్ విస్తరించింది. రూ.8.45 కోట్లతో ఖాజికుండ్-బనిహాల్ సొరంగాన్ని రూ.3127 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 8000 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 10 క్రాఫ్ట్‌లకు జిఐ ట్యాగ్‌, దోడాకు చెందిన గుచ్చి మష్రూమ్‌కు జిఐ ట్యాగ్‌, ఆర్‌ఎస్‌ పురాకు చెందిన బాస్మతి రైస్‌కు ఆర్గానిక్ సర్టిఫికేట్ లభించింది. మొత్తం వ్యవసాయ అభివృద్ధికి రూ.5013 కోట్లను కేంద్రం కేటాయించింది. జమ్మూ కశ్మీర్‌లోని వ్యక్తులందరికీ రూ. 5 లక్షల వరకు చికిత్సకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వంలో పర్యటకుల సంఖ్య దాదాపు 14 లక్షలు కాగా, 2022-23 లో రెండు కోట్ల మంది పర్యటకులు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించడం విశేషం. రెండు కోట్లకు పైగా పర్యటకుల రాకపోకల రికార్డు బద్దలైంది. రాష్ట్రంలో హోమ్‌స్టే విధానం, ఫిల్మ్‌ పాలసీ, హౌస్‌ బోట్‌ల పాలసీని రూపొందించే పని కూడా చేశారు. రూ.75 కోట్లతో జమ్మూ రోప్‌వే ప్రాజెక్టును పూర్తి చేశారు. పారిశ్రామిక విధానం కూడా పూర్తయింది. స్వాతంత్ర్యం వచ్చిన 75 యేళ్లలో కాంగ్రెస్ చేయలేనిది కేవలం తొమ్మిదేళ్లలో తాము చేసి చూపించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సభావేదికల మీద బహిరంగంగానే చెబుతుంటారు.