ఏఐతో జాబ్​ మార్కెట్​ కు కష్టాలు

సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే నిలకడ కృత్రిమ మేధస్సుకు సంస్థల తీవ్ర ప్రయత్నాలు 40శాతం ఉద్యోగాలపై ప్రభావం టెక్నాలజీతో సమస్యల పరిష్​కారం సులువు తప్పుడు సమాచారంపై హెచ్చరికలు మరో ముప్పుకు సిద్ధంగా ఉండాలన్న ఐఎంఎఫ్​ ప్రధానాధికారి క్రిస్టాలినా జార్జివా

May 14, 2024 - 15:39
May 14, 2024 - 15:41
 0
ఏఐతో జాబ్​ మార్కెట్​ కు కష్టాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఏఐ సాంకేతికత ద్వారా జాబ్​ మార్కెట్​ కు కష్టాలు తప్పవని ఐఎంఎఫ్​ (అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ) ప్రధానాధికారి (మేనేజింగ్​ డైరెక్టర్​) క్రిస్టాలినా జార్జివా తెలిపారు. దీన్ని తప్పించుకోవాలంటే ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మంగళవారం క్రిస్టాలినా జార్జివా మీడియాతో మాట్లాడారు. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ–కృత్రిమ మేధస్సు)తో రానున్న కాలంలో జాబ్​ మార్కెట్​ సమూలంగా మార్పు చెందబోతుందన్నారు. ఇందుకోసం పలు సాంకేతిక సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. ఏఐ టెక్నాలజీని మరింత వికసింప చేసే పనిలో పడ్డాయని తెలిపారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల్లో సాంకేతిక నిపుణులు కూడా వినూత్న ఆలోచనలతో ముందుకు వెళితే ఏఐతో కలిసి పనిచేయగలిగే సామర్థ్యాన్ని సాధిస్తేనే మార్కెట్​ లో మనగలుగుతారని ఆమె స్పష్టం చేశారు. రాబోయే కాలంలో ప్రపంచంలోనే 40 శాతం ఉద్యోగాలపై ఈ సాంకేతికత ప్రభావం చూపే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. అభివృద్ధి చెందిన దేశాలు ఏఐతో సాంకేతికత ద్వారా పనులు చేసుకోవాలనే యోచనలో ఉన్నాయని వెల్లడించారు.

అదే సమయంలో నూతన సమాజ నిర్మాణానికి అనేక సవాళ్లను కూడా ఏఐ ద్వారా ఇట్టే పరిష్కారం లభించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని జార్జివా పిలుపునిచ్చారు. 

ఏఐ ద్వారా ఆయా దేశాల్లో ఉత్పాదకత బాగా పెరుగుతోందని స్పష్టం చేశారు. సమర్థవంతంగా పనిని నిర్వహించగలదన్నారు. ఇదే సమయంలో మానవుల మధ్య ఈ టెక్నాలజీ అంతరాన్ని కూడా పెంచే ముప్పు పొంచి లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సాంకేతికత ద్వారా మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందని గ్రహించాలన్నారు. తప్పుడు సమాచారం వల్ల ఆయా దేశాల్లో ఉద్రిక్తతలు కూడా మరింత పెరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. 

ఇప్పటికే యుద్ధాలు, కరోనా, ఆర్థిక సంక్షోభం లాంటి అనేక సమస్యలను ఎదుర్కొని ఉపిరి పీల్చుకుంటున్న ప్రపంచదేశాలు ఏఐ సాంకేతికత ద్వారా ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉండాలని క్రిస్టాలినా జార్జివా తెలిపారు.