ప్రభుత్వ హాస్టళ్లలో మెరుగైన వసతి కల్పించాలి

కలెక్టర్ అభిలాష అభినవ్

Sep 28, 2024 - 18:41
Sep 28, 2024 - 19:14
 0
ప్రభుత్వ హాస్టళ్లలో మెరుగైన వసతి కల్పించాలి
నా తెలంగాణ, నిర్మల్: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. లక్ష్మణచాంద మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతి గృహ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వంట గదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాలతో కూడిన భోజనాన్ని అందించాలని, వంటకు నాణ్యమైన వస్తువులు, కూరగాయలను మాత్రమే వినియోగించాలన్నారు. విద్యార్థులకు వండిన ఆహారాన్ని రుచి చూశారు. గణితం సబ్జెక్టును విద్యార్థులకు బోధించి, సబ్జెక్టులో గల మెలకువలను విద్యార్థులకు నేర్పించారు. సౌర కుటుంబం గురించి విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. వంటగది, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, రీడింగ్ రూములు, విద్యార్థుల వసతి గదులను పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులంతా వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. రోజూ వారి జీవన విధానంలో సరైన సమయ పాలనను పాటించాలన్నారు. జీవితంలో విద్యతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. 
ఈ కార్యక్రమంలో డీఈఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ జానకి, లక్ష్మణచందా ఎంపీడీవో రాధ,ఎంపీఓ అమీర్ ఖాన్, సలోమి కరుణ, ఎఫ్ఏఓ పద్మ, ప్రధానోపాధ్యాయులు నవిత, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాను ఫలితాల్లో ప్రథమస్థానంలో నిలపాలి..


విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదివి జిల్లాను ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ అభిలాష అభినవ్ విద్యార్థులను కోరారు. పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అందజేశారు. 'వరల్డ్ విజన్ ఇండియా' ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో రాఘవేంద్ర పబ్లికేషన్స్ పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరల్డ్ విజన్ ఇండియా ఎన్జీవో సంస్థ అందజేసిన స్టడీ మెటీరియల్ విద్యార్థులు బోర్డు పరీక్షలకు సిద్ధం కావడానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. లక్ష్మణ చాంద మండలంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 364 మంది పదవ తరగతి విద్యార్థులకు సరిపడినన్ని పుస్తకాలు ఏరియా డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా అందించినట్లు తెలిపారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేసిన వరల్డ్ విజన్ ఇండియా ఎన్జీవో సంస్థ ప్రతినిధులను ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు మరిన్ని ఎన్జీవో సంస్థలు ముందుకు రావాలని సూచించారు. విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ వినియోగించుకొని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ  డాక్టర్ రవీందర్ రెడ్డి, ఎన్జీవో ప్రోగ్రాం అధికారి వై.బ్రహ్మన్న, ఎన్జీవో ప్రతినిధులు అంబేద్కర్, హంగమన్న, ఎస్ ఆర్ పబ్లికేషన్స్ ప్రతినిధి సాయినాథ్, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.