బంగ్లా ఆందోళనలు భారతీయుల క్షేమంపై దృష్టి
Bangla concerns focus on the welfare of Indians
- ఢిల్లీలో షేక్ హసీనా
- 19వేలమంది భారతీయులు
- భారతీయుల క్షేమంపై వివిధ పార్టీలకు విజ్ఞప్తి
- దాడులు కొనసాగడం దురదృష్టకరం
- విదేశాంగ కార్యాలయాలతో సమాచారం తెలుసుకుంటున్నాం
- సున్నిత అంశంపై జాగ్రత్తగా అడులేస్తున్నాం
- కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ గందరగోళం, నిరసనల మధ్య భారతీయుల క్షేమంపై దృష్టి సారించామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. మంగళవారం ఉదయం హోంశాఖ నేతృత్వంలోని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం వివరాలను పార్లమెంట్లో వెల్లడించారు.
బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత్ లో కొద్దిరోజులపాటు ఉండేందుకు అనుమతి కోరారని తెలిపారు. షేక్ హసీనా ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు.
బంగ్లాదేశ్ లో 19వేలమంది భారతీయులు ఉన్నారని అన్నారు. వారి పరిస్థితిపై భారత దౌత్య కార్యాలయం ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. 9వేలమంది విద్యార్థుల్లో చాలా మంది జూలైలోనే తిరిగి వచ్చారని జై శంకర్ వివరించారు.
బంగ్లాలోని వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడామని భారతీయుల క్షేమంపై అభ్యర్థనలు చేశామన్నారు. హింసలో భారతీయులు, ఆలయాలు, ఆస్తులపై దాడులను చేయవద్దని విజ్ఞప్తి చేశామన్నారు. దాడులు ఆందోళనకరమని ఆవేదన వెలిబుచ్చామన్నారు. ప్రస్తుతం అక్కడ అత్యంత ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఢాకాలోని హైకమిషన్‌తో పాటు, బంగ్లాదేశ్‌లో భారతదేశ దౌత్యపరమైన ఉనికిలో చిట్టగాంగ్, రాజ్‌షాహి, ఖుల్నా, సిల్హెట్‌లలోని అసిస్టెంట్ హైకమీషన్లు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయా కార్యాలయాలకు ప్రభుత్వం అవసరమైన భద్రతను కల్పిస్తుందని ఆశిస్తున్నామని జై శంకర్ తెలిపారు. పొరుగు దేశంలోని సున్నితమైన అంశం కాబట్టి భారతీయుల భద్రతకు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ స్పష్టం చేశారు.