పాక్ ఐఎస్ఐ కనుసన్నల్లోనే
జమాతే ఇస్లామ్ కీలక పాత్ర
ఆర్మీనే భయపెడుతున్న విద్యార్థి నేత నాయిద్ ఇస్లామ్
ఉగ్రసంస్థలో కీలకపాత్ర పోషిస్తున్న పదవీచ్యుతుడైన బ్రిగేడియర్ జనరల్
భారత్ లో ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్.. విచారణలో విస్తుపోయే వాస్తవాలు
ఐఎస్ఐ ఆజ్ఞల మేరకే ప్రధాని ఎన్నిక?
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరతకు గత మూడేళ్ల ముందు నుంచే అంకురార్పణ జరిగింది. పాక్ ఐఎస్ ఐ నేతృత్వంలోని బంగ్లా ఉగ్ర సంస్థ జమాతే ఇస్లామ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఉగ్ర సంస్థకు సంబంధించిన పలువురు విద్యార్థుల రూపంలో ఢాకా, చిట్టగాంగ్, జహంగీర్, సిల్హాట్, రాజ్ షాషీ యూనివర్సిటీల్లో చేరి విద్యార్థుల మనసుల్లో విషాన్ని నింపడంలో సఫలీకృతమయ్యారు.
విద్యార్థి నాయకుడు నాయిద్ ఇస్లామ్ కు జమాతే ఇస్లామ్ తో దగ్గరి సంబంధాలున్నాయి. వీరి ఆజ్ఞలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ విద్యార్థులను తప్పుదోవపట్టించడంలో ఇతను దిట్ట. అదే సమయంలో ఏకంగా బంగ్లాదేశ్ ఆర్మీని కూడా బెదిరించే స్థాయికి ప్రస్తుతం ఎదిగాడు. ఆందోళనల సందర్భంగా మాట్లాడుతూ.. యూనివర్సిటీల విద్యార్థులు ఎన్నుకున్న వారికే ప్రధాని పదవినీయాలని వేరే ఎవ్వరికీ ఇచ్చినా తాము ఒప్పుకునేది లేదని మరోమారు ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించాడు.
గతంలో సైన్యంలో పనిచేసి జమాతే ఇస్లామ్ ఉగ్రసంస్థతో సంబంధాలున్నాయనే కారణంతో షేక్ హసీనా ప్రభుత్వంలో పదవీచ్యుతుడైన బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ హాస్మీ ప్రస్తుతం ఈ ఉగ్రసంస్థలో క్రియాశీలక, కీలక పాత్ర పోషిస్తున్నాడు.
గతంలో భారత్ లో అరెస్ట్ అయిన జమాతే ఇస్లామ్ ఉగ్రసంస్థకు చెందిన ఆరుగురు వివరాలు, వారి ద్వారా సేకరించిన సమాచారంతో ఇంటలిజెన్స్ బృందాలు కీలక సమాచారాన్ని రాబట్టాయి. దీనిపై షేక్ హసీనా ప్రభుత్వానికి అప్రమత్తం కూడా చేశాయి. ఇక్కడ పట్టుబడిన వారంతా బంగ్లాదేశ్ లోని జమాతే ఇస్లామ్ కు చెందినవారే కావడం గమనార్హం.
ప్రస్తుతం చెలరేగుతున్న ఆందోళనల్లో విద్యార్థులు కీలుబొమ్మలుగా మారారు. విద్యార్థుల మనస్సుల్లో బేదాభిప్రాయాలు సృష్టించడం, వారిని బ్రెయిన్ వాష్ చేయడంలో వీరంతా కీలకపాత్రలు పోషించారు. మూడేళ్లముందే ఆయా యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు కాస్త విద్యార్థి నేతలుగా ఎదిగి తోటి విద్యార్థులతో కలిసి నకిలీ ఐడీ కార్డులు సృష్టించి పాక్ ఐఎస్ ఐకు చెందిన వారిని ఈ ఆందోళనల్లో విద్యార్థులకు తెలియకుండానే భాగస్వామ్యం చేయగలిగారు.
ఏది ఏమైనా బంగ్లాలో తరువాత ఏర్పడే ప్రభుత్వం భారత్ కు అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అయితే అక్కడ ఏ ప్రభుత్వాలు ఏర్పడినా పాక్ ఐఎస్ ఐ కనుసన్నల్లోనే అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు భారత ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.