తెలంగాణ గల్ఫ్ కార్మికులకు సీఎం అభయ " హస్తం "
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటుకు నిర్ణయం బోర్డులో ఓ ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని నియమిస్తం సెప్టెంబర్ 17 లోపు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంట రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయి అక్కడ అవస్థలు పడుతున్న కార్మికులకు బీమా సౌకర్యం ఇస్తం అక్కడ ఇబ్బంది పడే తెలంగాణ వాసుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తం
నా తెలంగాణ, హైదరాబాద్: ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళ్తున్న తెలంగాణ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఇందులో ఓ ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని నియమిస్తామన్నారు. సెప్టెంబర్ 17 లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. మంగళవారం తాజ్ డెక్కన్ లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడితూ.. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని.. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉందన్నారు. ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిప్పీన్స్, కేరళలో మంచి విధానం ఉందని ఈ విషయంలో ఇతర దేశాలు, రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానంపై అధ్యయనం చేస్తున్నామన్నారు. అన్నీ అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వం కూడా సమగ్ర విధానం రూపొందిస్తామన్నారు.
గల్ఫ్ కార్మికులకు చనిపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని రాబోయే రోజుల్లో రైతు బీమా ఉన్నట్లుగానే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం ఏర్పాటు ఆలోచన చేస్తున్నామన్నారు. ఏ దేశంలోనైనా తెలంగాణ బిడ్డలు ఇబ్బందుల్లో ఉంటే వారు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇది రాష్ట్ర పరిధితో పాటు కేంద్ర పరిధిలోని అంశం అని అందువల్ల జాతీయ స్థాయిలో మీ ప్రతినిధులు ఉండాలని అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు..