సిసోడియాకు బెయిల్
లిక్కర్, ఈడీ కేసుల్లో బిగ్ రిలీఫ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సిసోడియా 17 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. సిసోడియా సాయంత్రానికి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని రెవెన్యూ కోర్టుకు పంపనున్నారు. రూ. 10 లక్షల ఇద్దరి పూచీకత్తుతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ సందర్భంగా సుప్రీం పలు షరతులు విధించింది. సాక్షులను ప్రభావితం చేయరాదని, పాస్ పోర్ట్ ను అప్పజెప్పాలని తెలిపింది.
అవినీతి కేసులో సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. 2023 మార్చి 9న మనీలాండరింగ్ కేసులో ఇడి అరెస్టు చేసింది. 2023 ఫిబ్రవరి 28న మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఈ కేసులో ఇప్పటివరకు 400 మందికి పైగా సాక్షులు, వేలాది డాక్యుమెంట్లు సమర్పించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. రానున్న రోజుల్లో కేసు ముగిసే అవకాశం లేదు. అటువంటి పరిస్థితిలో, సిసోడియాను కస్టడీలో ఉంచడం అతని ప్రాథమిక స్వేచ్ఛా హక్కును ఉల్లంఘించడమే అవుతుందని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది.