కుప్వారాలో స్వాధీనం చేసుకున్న భద్రత బలగాలు
రెండు రహాస్య స్థావరాలను గుర్తించిన ఆర్మీ
ఖండ్రా టాప్ అడవుల్లో 23మంది ఉగ్రవాదులు?
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో భారీ ఉగ్రదాడులకే ముష్కర మూకలు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. బుధవారం ఇద్దరు లష్కరే తీవ్ర వాదుల ఎన్ కౌంటర్ అనంతరం జరిగిన సోదాల్లో ఆర్మీ అధికారులు భారీ ఆయుధ డంప్ ను కనుగొన్నారు. మరో ఆయుధ డంప్ ను గురువారం ఉదయం చెట్టుతొర్రలో గుర్తించారు.
కుప్వారా, కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల రెండు రహాస్య స్థావరాలను ఆర్మీ అధికారులు కనుగొన్నారు. పెద్ద యెత్తున వీటి నుంచి పెద్ద యెత్తున మందుగుండు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
కుప్వారాలోని కేరన్ సెక్టార్ లో ఓ పెద్ద చెట్టుకింద గొయ్యి తవ్వి ఈ రహాస్య స్థావరాన్ని ఏర్పర్చి ఆయుధ డంప్ ను నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ గొయ్యి 5 నుంచి 6 అడుగుల మేర ఉంది. ఇందులో నుంచి 00కు పైగా ఏకే-47 కాట్రిడ్జ్‌లు, 20 హ్యాండ్ గ్రెనేడ్లు, 10 చిన్న రాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంటలిజెన్స్, ఎన్నిక సంఘం అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆర్మీ, పోలీసులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.
ఎన్నికలకు మరో ఆరు రోజులు మాత్రమే మిగిలిఉంది. ఈ నేపథ్యంలో పాక్ వైపు నుంచి సరిహద్దు వద్ద సీజ్ ఫైర్ ను ఉల్లంఘించి కాల్పులకు కూడా పాల్పడ్డారు. రాజౌరీ నుంచి ఎల్ వోసీని దాటేందుకు ఇద్దరు ఉగ్రవాదులు ప్రయత్నించగా భద్రత దళాలు ఆ చర్యను తిప్పికొట్టి వారిని హతమార్చాయి. వారి వద్ద నుంచి ఎం–4 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ లో రెండు ఏకే-47లు, 1 ఎం-4 రైఫిల్, 1 పిస్టల్, 8 గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
11న ఉదంపూర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉదంపూర్ లోని ఖండ్రా టాప్ అడవుల్లో 23మంది ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ అటవీ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి అణువణువునా శోధిస్తున్నారు. ఉగ్రవాదుల పనిపట్టేందుకు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను కూడా ఉపయోగించుకుంఉన్నారు.