చండీగఢ్: బాబా సాహేబ్ అంబేద్కర్ నమ్మిన, రాసిన సిద్ధాంతాలను పాటిస్తేనే నిరుపేద వర్గాలకు సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నిరుపేదలకు సేవ చేసేందుకు మార్గనిర్దేశకాన్ని సూచించారన్నారు. పేదలు, రైతుల ఆర్థిక పురోగతి వేగంగా మార్పు చెందాలన్నదే ఈ మహానీయులు ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
బుధవారం హరియాణాలోని సోనిపట్ గోహనాలో ఎన్నికల సభను ఉద్దేశించి ప్రసంగించారు. మరికొద్ది రోజుల్లో హరియాణాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ.. రైతులు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే తమకు ముఖ్యమన్నారు. ఇరువురి కార్యదక్షతను ఆచరించడంలో బీజేపీ ముందు వరుసలో ఉంటుందని, వరి ఆశయాలను కాపాడడంలో, నెరవేర్చేందుకు తాము బీజం వేశామన్నారు. ఇప్పుడు సత్ఫలితాలను సాధిస్తున్నామని తెలిపారు. వీరి స్ఫూర్తితో దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకువెళతామన్నారు.
జమ్మూకశ్మీర్ లో ఓటింగ పెరగడంపై హర్షం..
దేశాభివృద్ధిలో హరియాణా సహకారం గర్వంగా ఉందన్నారు. జమ్మూకశ్మీర్ లో రికార్డు స్థాయిలో ఓటంగ్ నమోదు కావడం సంతోషకరమన్నారు. ప్రజవాస్వామ్య అతిపెద్ద పండుగలో ప్రతీ ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారని వారందరికీ పేరు పేరును కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధిలో దళితులు, నిరుపేదలదీ కీలకపాత్ర..
నేడు హరియాణా వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని కొనియాడారు. పారిశ్రామికీకరణ పెరిగినప్పుడు రైతులు, దళితులు, పేదలకు లబ్ధి చేకూరుతుందని అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతమన్నారు. ఈ అభివృద్ధికి దళితులు సాధికారత పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. నిరుపేదలను, దళితులను అత్త్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే అనేక రకాల స్కిల్స్ సెంటర్ ను తెరిచి వారికి అత్యుత్తమ శిక్షన అందజేస్తున్నామని తెలిపారు. దాని ఫలితాలు మెరుగ్గా లభిస్తున్నాయని తెలిపారు. బాబా సాహెబ్ ఆలోచనలు నిజం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు.
వ్యవసాయరంగం రూపురేఖలు మారుస్తాం..
నిరంతరం పెరుగుతున్న జనాభా వల్ల భూమి విస్తీర్ణం తగ్గి వ్యవసాయ రంగానికి విఘాతం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం అందరికీ మేలు చేసేందుకు సాంకేతికతను అవలంబిస్తుందని తెలిపారు. దీని ద్వారా తక్కువ విస్తీర్ణంలో మేలు రకాలైన పంటలను పండించగలుగుతున్నామని తెలిపారు. అదే సమయంలో రైతు కుటుంబాలకు కూడా నూతనావాశాలు కల్పించగలుగుతునామని తెలిపారు. వ్యవసాయ రంగం రూపురేఖలు మారుస్తూ రైతన్నకు ఆర్థిక పరిపుష్ఠి కలిగేలా అనేక చర్యలు చేపట్టామన్నారు.
భారత్ లో పెట్టుబడులకు వ్యాపారుల ఆసక్తి..
అమెరికాలో పెద్ద పెద్ద నాయకులను, వ్యాపార వేత్తలను కలిశానని తెలిపారు. వారు పురోభివృద్ధి సాధిస్తున్న భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నారని తెలిపారు. హరియాణాలో కూడా పెట్టుబడులు వస్తాయని హామీ ఇచ్చారు. తమ పదేళ్ల మేక్ ఇన్ ఇండియా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఎగుమతుల రాష్ర్టంగా హరియాణా..
హరియాణా నుంచి 35 శాతం కార్పెట్, 20 శాతం బట్టలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. వాహనాలు, విమాన వాహక నౌకల వరకూ పెద్ద పెద్ద కర్మాగారాలు ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం సుజుకి కార్లు ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.
దోచుకుతినే పార్టీ కాంగ్రెస్..
హరియాణాలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలో నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని మోదీ తెలిపారు. కాంగ్రెస్ కుటుంబం, అవినీతికి కేరాఫ్ అని ఆరోపించారు. బంధుప్రీతి పార్టీ అన్నారు. ఈ పార్టీని హరియాణాలోకి అడుగు పెట్టనిస్తే రాష్ర్టాన్ని దోచుకుతినడంలో ముందుంటుందని పేర్కొన్నారు.
అందుకే రానున్న ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని బీజేపీ అన్ని విధాలా రాష్ర్ట, ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రజలకు విజ్ఙప్తి చేశారు.