పేదరికాన్ని రూపుమాపే పార్టీలకే ఓటేయాలి
గాంధీనగర్ లో ఓటేసిన కేంద్ర మంత్రి అమిత్ షా
గాంధీనగర్: భారత్ లో పేదరికాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రయత్నించే వారికే ఓటు వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అమిత్ షా గాంధీనగర్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 9గంటలకు ఓటు వేశారు. అమిత్ షా ఉదయం 6.30 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ప్రధానికి స్వాగతం పలికారు. ఓటు వేసిన అనంతరం అమిత్ షా కామేశ్వర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు.
దేశాన్ని సురక్షితంగా ఉంచే పార్టీలకు, ప్రపంచంలోనే ఆర్థిక రంగంలో భారత్ ను అగ్రగామిగా నిలిపే పార్టీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించే పార్టీకే ఓటు వేయాలని తెలిపారు. గుజరాత్ లోని 25 స్థానాల్లో కేవలం రెండు గంటల్లోనే 20 శాతం ఓటింగ్ జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పండుగలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సురక్షిత భారత్ కు పునాదులు వేసే పార్టీకే ప్రజలు ఓటు వేయాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.