రూ. 500 బోనస్ పై కాంగ్రెస్ యూటర్న్ సన్న వడ్లకే ఇస్తామని సీఎం ప్రకటన
తెలంగాణలో ఎక్కువగా పండేవి దొడ్డు వడ్లే.. రేవంత్ వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం.. పోలింగ్ ముగిశాక మెలిక పెట్టడంపై అభ్యంతరం
నా తెలంగాణ, హైదరాబాద్: అధికారంలోకి వస్తే.. వరి ధాన్యంకు ప్రభుత్వ మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మాట మార్చింది. సన్న వడ్లు పండించే రైతులకే రూ.500 బోనస్ ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిపిన చిట్ చాట్ లో ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రైతులు ఎక్కువగా పండించేదే దొడ్డు వడ్లు అయితే.. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని సీఎం ఎలా చెప్తారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.
ఇంటి మందమే సన్నవడ్లు..
రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. వారి తిండి అవసరాలకు సరిపడా సన్న వడ్లు సాగు చేసి, మార్కెట్ లో విక్రయించడానికి దొడ్డు వడ్లే సాగు చేస్తారు. ఎందుకంటే దొడ్డు వడ్లతో పోలిస్తే.. సన్న వడ్లకు చీడపీడల బెడద, పెట్టుబడి ఎక్కువ.. దిగుబడి తక్కువ. వానాకాలం సీజన్ లో అయితే సన్నవడ్లకు విపరీతమైన రోగాలు వస్తుంటాయి. అందుకే రైతులు స్వల్పంగా సన్నవడ్లు సాగు చేసి.. మిగతాది మొత్తం దొడ్డు వడ్లు వేస్తారు. మొత్తం సాగయ్యే వరిలో సన్నవడ్ల సాగు శాతం 20 శాతం కూడా మించదు. ప్రభుత్వం రూ.500 బోనస్ హామీ నుంచి తప్పించుకునేందుకు సన్నవడ్లు సాగు చేసేవారికే ఇస్తామనే నిబంధనను ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తీసుకువచ్చిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే రైతు బంధు పెట్టుబడి సాయం ఇవ్వక, రుణమాఫీ చేయక, కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను గుర్తించక, ధాన్యం కొనుగోళ్లను సకాలంలో పూర్తి చేయక.. తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. బోనస్ విషయంలోనూ మోసం చేసిందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
5 వేల కోట్లు ఆదా కోసమేనా?
ఏటా వానకాలం, యాసంగి కలిపి సుమారు 1.20 కోట్ల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఏటా కోటి టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన కోటి టన్నులకు బోనస్ ఇవ్వాల్సి వస్తే ఏటా సుమారు రూ. 5 నుంచి-7 వేల కోట్ల దాకా ప్రభుత్వంపై భారం పడే అవకాశముంది. కేవలం సన్నాలకే బోనస్ ఇవ్వాల్సి వస్తే మిల్లర్లు, వ్యాపారుల కొనుగోళ్లు, రైతుల అవసరాలు పోను కేవలం 10 నుంచి -20 లక్షల టన్నుల కన్నా ఎక్కువ కొనే పరిస్థితి ఉండదు. ఇలా అయితే కేవలం రూ. వెయ్యి కోట్లతో కథ ముగిసిపోతుంది. అందుకే ఈ మెలిక పెడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.