కరెంట్ పై ఫైట్​..!

Fight on current

Jul 30, 2024 - 11:43
Jul 30, 2024 - 11:45
 0
కరెంట్ పై ఫైట్​..!

విద్యుత్ అంశాలపై దద్దరిల్లిన​ అసెంబ్లీ
మంత్రి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్​రెడ్డిల మధ్య మాటల తూటాలు
విద్యుత్ కొనుగోళ్ల విచారణకు కొత్త ఛైర్మన్ ను నియమిస్తామన్న సీఎం
కమీషన్లకు కక్కుర్తి పడే సబ్ క్రిటికల్ తో భద్రాద్రి లో నిర్మాణం
మరో రెండేళ్లలో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పూర్తి చేస్తామన్న సర్కార్​
సింగరేణిలో రూ.12 వేల కోట్ల అవినీతి జరిగిందన్న సీపీఐ
విద్యుత్‌ కోతలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్న బీఆర్​ఎస్​
రెండో రోజూ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు
19 బడ్జెట్ పద్దులపై చర్చ.. ఆమోదం
సభలో ప్రవేశపెట్టిన భట్టి, శ్రీధర్​ బాబు, పొన్నం, జూపల్లి

నా తెలంగాణ, హైదరాబాద్​: విద్యుత్​ పద్దులపై జరిగిన చర్చతో అసెంబ్లీ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం, వాదోపవాదాలు, సవాళ్లతో శాసనసభ మార్మోగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్​ ఒప్పందాలు, తీసుకున్న నిర్ణయాలు, పాలసీలు, భద్రాద్రి, యాదాద్రి పవర్​ ప్లాంట్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై అధికార కాంగ్రెస్​, మిత్రపక్షం సీపీఐ అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్​ఎస్​ను నిలదీశాయి. దీంతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​, సీపీఐ సభ్యులకు దీటైన సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. ఆదివారం ఒక్క రోజు విరామం తర్వాత సోమవారం తిరిగి ప్రారంభమైన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి 19 పద్ధులపై బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఈ పద్దులను సభలో ప్రవేశపెట్టారు. పద్దుల్లో ప్రధానంగా ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమలు, ఐటి, ఎక్సైజ్ హోమ్, కార్మిక ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వైద్య ఆరోగ్య తదితర 19 పద్దలపై చర్చించి ఆమోదం తెలిపారు.‌ ఈ పద్ధులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో ప్రవేశపెట్టారు.

విద్యుత్ పై విచారణ కోరింది వాళ్లే... వద్దంటున్నది వాళ్లే : సీఎం
బీఆర్ఎస్ పాలనలో విద్యుత్​ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు. విద్యుత్​ అంశంపై న్యాయవిచారణ కోరింది బీఆర్ఎస్ సభ్యులేనన్న సీఎం... నిజానిజాలు బయటకు వస్తాయని వద్దంటున్నది వాళ్లేనని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోనుగోలు, యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై న్యాయవిచారణ అంశంపై మాట్లాడిన సీఎం... ఆయా ప్రాజెక్టుల్లో నిధులు దిగమింగింది తేల్చడానికే విచారణ కమిషన్‌ వేశామని వెల్లడించారు. కమీషన్లకు ఆశపడే బీఆర్ఎస్​ సర్కార్ కాలం చెల్లిన సబ్ క్రిటికల్​ టెక్నాలజీతో భద్రాద్రి పవర్​ ప్లాంట్ నిర్మించిందని సీఎం మండిపడ్డారు. అప్పటి బీఆర్ఎస్ నేతలు కమీషన్లకు ఆశపడి ఇండియా బుల్స్​ అనే గుజరాత్​ కంపెనీతో కూడబలుక్కుని, బీహెచ్​ఈఏల్​ నుంచి నామినేషన్​ బేసిస్​​ మీద సబ్ క్రిటికల్​ టెక్నాలజీ మెషీన్లు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. 

కోర్టుల నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తున్నారు...!
బీఆర్​ఎస్​ నేతలు కోర్టుల నిర్ణయాలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇలా మాట్లాడితే ప్రాసిక్యూట్‌ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం లోగా విద్యుత్ కొనుగోళ్ల విచారణకు కొత్త ఛైర్మన్ ను నియమిస్తామన్న సీఎం.. బీఆర్ఎస్​ వాదనలు అక్కడ చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. గత విద్యుత్ కమిషన్‌ ఎదుట కేసీఆర్‌ ఎందుకు హాజరుకాలేదని సీఎం ప్రశ్నించారు. విద్యుత్‌పై విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని తెలిపారు. ​ 

విద్యుత్‌ కోతలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు : జగదీశ్వర్‌రెడ్డి
విద్యుత్ అంశంలో అధికార పక్షం చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి ఆక్షేపించారు. కొత్తగూడెం విద్యుత్‌ ప్లాంట్‌ కూడా బీహెచ్‌ఈఎల్‌కే ఇచ్చామని తెలిపారు. కొత్తగూడెం విద్యుత్‌ ప్లాంట్‌ను అతి తక్కువ సమయంలో పూర్తి చేశామని పేర్కొన్నారు. విద్యుత్‌ కోతలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ కోతలపై పత్రికల్లోనూ వార్తలు వస్తున్నాయని వెల్లడించారు. రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడానికి గతంలో కేసీఆర్‌ ఒప్పుకోలేదన్న జగదీశ్వర్​ రెడ్డి.. కేంద్రం ఇచ్చే రూ.30 వేల కోట్లను కూడా వదులుకున్నట్లు వివరించారు. 2014లో రూ.24 వేల కోట్ల అప్పుతో విద్యుత్ రంగం మా చేతికి వచ్చిందని జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా చేయాలని ప్రశ్నించారు. అప్పులు చేయకుండా నోట్లు ముద్రించాలా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని అసెంబ్లీలో ఆనాడే కేసీఆర్‌ చెప్పారని గుర్తుచేశారు. 2014లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్‌ వినియోగం 1,196 కిలో వాట్లు ఉండగా 2024లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్‌ వినియోగం 2,349 కిలో వాట్లు అని చెప్పారు. 

సింగరేణిలో రూ. 10 వేల కోట్ల అవినీతి  : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
సింగరేణిలో దాదాపు రూ.10 వేల నుంచి రూ. 12 వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ సింగరేణికి ప్రభుత్వం నుంచి రూ.21 వేల కోట్లు రావాలని గుర్తుచేశారు. విద్యుత్, సింగరేణిని కలిపి విచారణ చేపట్టాలని కోరారు. విద్యుత్ ప్లాంట్లలో సబ్ క్రిటికల్ టెక్నాలజికి వెళ్లడం వెనక మతలబు ఏంటో అని ప్రశ్నించారు. సింగరేణిని, కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకెళ్లాలని సూచించారు.